గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఇవాళ వందవ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో గాంధీనగర్‌లో ఉన్న ఆమె నివాసానికి ప్రధాని మోదీ వెళ్లారు. 1923, జూన్ 18వ తేదీన హీరాబెన్ మోదీ జన్మించారు. ఇవాళ తల్లి హీరాబెన్ ఆశ్వీరాదం తీసుకుని, ఆమె పాదాలను ప్రధాని మోదీ కడిగారు. ఆమెతో కాసేపు ముచ్చటించారు. తల్లి హీరాబెన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ తన ట్విట్టర్లో కొన్ని అభిప్రాయాలను పంచుకున్నారు. తన బ్లాగ్‌లో అభిప్రాయాలు ఉన్న లింక్‌ను పోస్టు చేశారు. అమ్మ అనే మాట ఓ డిక్షనరీలో పదం మాత్రమే కాదు అని, ఎన్నో భావాలకు సంకేతామన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Maa…this isn’t a mere word but it captures a range of emotions. Today, 18th June is the day my Mother Heeraba enters her 100th year. On this special day, I have penned a few thoughts expressing joy and gratitude. https://t.co/KnhBmUp2se
— Narendra Modi (@narendramodi) June 18, 2022
తల్లి పిల్లలకు జన్మనివ్వడమే కాదు.. వారి ఆలోచనల్ని, వ్యక్తిత్వాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపుతుందన్నారు. పిల్లలకు సేవ చేసే క్రమంలో నిస్వార్థమైన త్యాగం చేస్తుందన్నారు. తన తల్లి హీరాబెన్ శత వసంతంలోకి అడుగుపెట్టడం తనకు సంతోషాన్ని ఇస్తున్నట్లు మోదీ తన బ్లాగ్‌లో వెల్లడించారు. తల్లి తన ప్రేమతో పిల్లల్లో మానవ విలువల్ని నేర్పుతుందన్నారు.
ఇంటిని గడిపేందుకు తన తల్లి కొన్ని ఇండ్లల్లో గిన్నెలు తోమే పనిచేసేదన్నారు. ఇంటి ఆదాయం కోసం చరఖా కూడా తిప్పేదన్నారు. పత్తి తీయడం, స్పిన్నింగ్ లాంటి ఎన్నో పనులు చేసినట్లు మోదీ తన తల్లి పట్ట కష్టాల్ని తన బ్లాగులో గుర్తు చేశారు. వర్షాకాలంలో తమ ఇళ్లు కురిసేదని, ఆ సమయంలో ఇంట్లో ఉన్న గిన్నెల్లో ఆ నీళ్లను తన తల్లి పట్టేదని, ఆ కురిసిన వర్షపు నీళ్లను కొన్ని రోజుల పాటు వాడేదని, నీటి సంరక్షణకు ఇంత కన్నా ఉదాహరణ ఏమీ ఉండదని మోదీ గుర్తు చేశారు.
స్వచ్ఛత గురించి తన తల్లి ఎంతో ఫోకస్ చేసేదన్నారు. ఇంటి వద్దకు వచ్చే శానిటేషన్ కార్మికులకు కచ్చితంగా ఛాయ్ ఇచ్చేదన్నారు. సఫాయి కార్మికులు తమ ఇంటి వద్దే కాలం గడిపేవారన్నారు. ఇక ప్రతి ఎండాకాలం తన తల్లి పక్షుల కోసం నీళ్లు నింపిన గిన్నెలను బయటపెట్టేదన్నారు. తన తండ్రి స్నేహితుడి కుమారుడైన అబ్బాస్ అనే వ్యక్తికి తన తల్లి సేవ చేసినట్లు మోదీ గుర్తు చేశారు. అబ్బాస్‌ను ఎంత ప్రేమగా చూసుకుందంటే, ఈద్ వేళ అతనికి ఇష్టమైన వంటకాలు చేసేదన్నారు.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi met his mother Heeraben Modi at her residence in Gandhinagar on her birthday today.
Heeraben Modi is entering the 100th year of her life today. pic.twitter.com/7xoIsKImNN
— ANI (@ANI) June 18, 2022
తల్లి హీరాబెన్‌కు తనపై అమితమైన విశ్వాసం ఉందని మోదీ గుర్తు చేశారు. చదువు లేకున్నా ఉన్నతంగా జీవించవచ్చు అని తెలుసుకున్నానని, ఆమె ఆలోచనా విధానం, ఆమె ముందు చూపు తననెప్పుడూ ఆశ్చర్యపరిచినట్లు మోదీ తన బ్లాగ్‌లో రాశారు. పౌరురాలిగా ఆమె తన కర్తవ్యాన్ని ఎప్పుడూ నిర్వర్తించిందని, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ప్రతి ఎన్నికల్లో తన తల్లి ఓటేసినట్లు మోదీ తెలిపారు. తన తల్లి ఎప్పుడూ ఏ అంశంలోనూ ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదన్నారు.
తన తల్లి పేరిట ఎటువంటి ఆస్తులు లేవన్నారు. ఆమెను ఎప్పుడూ బంగారు ఆభరణాల్లో చూడలేదన్నారు. వాటిపై ఆమెకు మోజు కూడా లేదన్నారు. తన చిన్న రూమ్‌లో ఆమె చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించడాన్ని చిన్ననాటి నుంచి తన తల్లిలో చూసినట్లు చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయాలను ఆమె ఎప్పుడూ గౌరవించేదన్నారు. ఎటువంటి అడ్డు కానీ ఆటంకాలు చెప్పలేదన్నారు. ప్రతి నిర్ణయంలో ఆమె ప్రోత్సాహం ఉందన్నారు. తన సోదరసోదరీమణులతో పోలిస్తే తనలో డిఫెరెంట్ మైండ్‌సెట్ ఉండేదన్నారు.
తల్లి హీరాబెన్ జీవితం త్యాగానికి ప్రతీక అని, భారతీయ మాతృశక్తికి నిదర్శనమని మోదీ అన్నారు. ప్రతి పోరాటం వెనుక ప్రతి తల్లి బలమైన పట్టుదల ఉంటుందని మోదీ తన తల్లిని కీర్తించారు.