PM Modi : జాతీయ అంతరిక్ష దినోత్సవం (National Space Day) సందర్భంగా ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజలకు, శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగం (Space Sector) లో భారత్ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోందని, పెట్టుబడిదారులకు ఒక ‘ఆయస్కాంతం’ లా మారిందని ఆయన అభివర్ణించారు. స్పేస్ సెక్టార్‌లోని స్టార్టప్‌ల సీఈవోల (Startups CEOs) తో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జెన్-జీ యువత సరికొత్త టెక్నాలజీని నిర్మిస్తోందని ప్రశంసించారు. అదేవిధంగా తన ప్రసంగాలతో కూడిన ఒక వీడియోను ఆయన పంచుకున్నారు.
“అయోధ్యలో నేను చెప్పినట్లుగా ఇది ఒక కొత్త మార్పునకు నాంది. ఈ కొత్త శకంలో, ప్రపంచ క్రమంలో భారత్ తన అంతరిక్ష ఉనికిని స్థిరంగా విస్తరిస్తోంది. 2047 నాటికి వికసిత భారత్ సాధించాలన్న మన సంకల్పంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుంది” అని మోదీ పేర్కొన్నారు. దేశ యువతను కొనియాడుతూ.. ఈ రోజు మన జెన్-జీ ఇంజినీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలను ఆవిష్కరిస్తున్నారని అన్నారు. ప్రొపల్షన్ సిస్టమ్స్ నుంచి శాటిలైట్ ప్లాట్‌ఫారమ్‌ల వరకు మన యువత గతంలో ఊహించని రంగాలలో పనిచేస్తోంది” అని అన్నారు. ఇస్రో విజయాలు ఎంతోమంది పిల్లలకు శాస్త్రవేత్తలు కావాలనే స్ఫూర్తిని ఇస్తున్నాయని చెప్పారు.
2023లో ఇదే రోజున చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన చారిత్రక ఘట్టానికి గుర్తుగా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాది “వికసిత భారత్ దిశగా : ఆవిష్కరణ, సహకారం, ప్రపంచ అంతరిక్ష నాయకత్వం” అనే థీమ్‌తో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ మాట్లాడుతూ.. దేశ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు ఎంతో అవసరమని పిలుపునిచ్చారు.