Brijbhushan : బీజేపీ మాజీ ఎంపీ (BJP Ex MP) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (BrijBhushan Sharan Singh).. యోగా గురు (Yoga Guru) బాబా రామ్‌దేవ్ (Baba Ramdev) పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్వదేశీ పేరుతో రామ్‌దేవ్ చేస్తున్న ప్రచారంలో నకిలీ ఉత్పత్తులు, విదేశీ వస్తువులు కూడా ఉన్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పతంజలి (Patanjali) లో కల్తీ ఉత్పత్తులు అమ్ముతున్నారని ఆరోపించారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య కొనసాగుతున్న వివాదం ఈ వ్యాఖ్యలతో మళ్లీ తెరపైకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కళాశాల కార్యక్రమంలో బ్రిజ్ భూషణ్ మాట్లాడారు. స్వదేశీ ఉద్యమాన్ని రామ్‌దేవ్ మొదట్లో బాగానే నడిపారని, కానీ ఇప్పుడు ఆయన విదేశీ లోదుస్తులను కూడా తయారు చేస్తున్నారని వ్యంగ్యంగా అన్నారు. దేశంలో నకిలీ నెయ్యిపై తరచూ ప్రశ్నలు వస్తున్నాయని, దానికి రామ్‌దేవే బాధ్యత వహించాలని బ్రిజ్ భూషణ్ ఆరోపించారు. భవిష్యత్తులో రామ్‌దేవ్ ఏదైనా ఆందోళన చేస్తే, గతంలో లాగా ‘సిందూరం’, ‘సల్వార్’ ధరించి రాకూడదని, ఈసారి ‘మగాడిలా’ నిర్ణయాత్మక పోరాటం చేయాలని బ్రిజ్ భూషణ్ సవాల్ విసిరారు.
గతంలో జరిగిన ఓ నిరసన సందర్భంగా రామ్‌దేవ్ మహిళ వేషధారణలో తప్పించుకోవాలని చూసిన ఘటనను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అయితే బ్రిజ్ భూషణ్, రామ్‌దేవ్ మధ్య ఈ వివాదం కొత్తేమీ కాదు. 2022లో ఈ గొడవ మొదలైంది. మహర్షి పతంజలి జన్మస్థలమైన గోండా జిల్లాకు పతంజలి సంస్థ ఏమీ చేయలేదని, కాబట్టి తమ బ్రాండ్‌కు ‘పతంజలి’ పేరును వాడటం ఆపాలని బ్రిజ్ భూషణ్ అప్పట్లో డిమాండ్ చేశారు. అప్పటి నుంచి వీరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బ్రిజ్ భూషణ్ తాజా ఆరోపణలపై బాబా రామ్‌దేవ్ లేదా పతంజలి సంస్థ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.