Punjab Polls : ఎన్నికలంటే ప్రజలకే కాదు.. నాయకులకూ ఓ అమృతమే. ఓటు వేసి, తమకిష్టమైన వారిని ఎన్నుకుందానమన్న జోష్‌లో ప్రజలుంటారు. ప్రజలే వేసిన ఓట్లతో అధికార పీఠంపై కూర్చొని, సకల సౌకర్యాలూ అనుభవిస్తామన్న డాబు, దర్పంతో నేతలుంటారు. ఎవరి గొడవ వారిదే. ఈ గొడవకు వయస్సుతో ఏమాత్రం సంబంధమే లేదు. రాజకీయ పాచికలు వేయడానికి, ప్రత్యర్థులకు మూడు చెరువుల నీళ్లు తాపడానికి వయస్సు అడ్డేరాదు. జయప్రకాశ్ నారాయణ్ ఏకంగా వీల్‌చైర్‌లో తిరుగుతూ దేశ రాజకీయ గతినే మార్చిపారేశారు. ఇదంతా ఎందుకంటే.. 94 ఏళ్ల వయస్సున్న అకాలీదళ్ అధ్యక్షుడు ప్రకాశ్ సింగ్ బాదల్ మళ్లీ పోటీకి రెడీ అయ్యారు. చాలా రోజుల పాటు ఆయన రాజకీయాలకు దూరంగానే వున్నారు.
ఎన్నికలు దగ్గరపడ్డ వేళ… 94 ఏళ్ల వయస్సులోనూ యాక్టివ్ అయిపోవడం ఆశ్చర్యమే. దాదాపు ఐదుసార్లు ఆయన పంజాబ్ సీఎంగా పనిచేశారు. 93 ఏళ్ల వయస్సులోనూ తన నియోజకవర్గాన్ని చుట్టి వస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. ఇదీ విశేషం. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. వయస్సు మీద పడుతున్న కొద్దీ, పంజాబ్ రాజకీయాలు మారుతున్న కొద్దీ, క్రియాశీలకంగా లేరు. మళ్లీ ఇప్పుడు క్రియాశీలకమయ్యారు.
కొన్ని రోజులుగా జ్వరంతో ప్రకాశ్ సింగ్ బాదల్ ఆస్పత్రిలో చేరారు. జనవరి 19నే డిశ్చార్జీ అయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా ఆయన ఎన్నికల వ్యూహం గురించే సమాలోచనలు జరిపారట. నియోజకవర్గం పరిస్థితిని కూడా అధ్యయనం చేశారట. ట్రెండ్ గురించి ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకుంటూనే వున్నారట. ఇప్పుడే ఏకంగా ప్రచార పర్వంలోకే దిగిపోయారు. అకాలీదళ్ పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అందులో ప్రకాశ్ సింగ్ బాదల్ పేరు కూడా ఉంది. లంబీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు.
1997 నుంచీ లంబీ నియోజకవర్గం నుంచే బరిలోకి
ప్రకాశ్ సింగ్ బాదల్ 1997 నుంచే లంబీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. 2002, 2007, 2012,2017 సంవత్సరంలో ఆయన ఇక్కడి నుంచే పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఆయన మాజీ సీఎం కెప్టన్ అమరీందర్ సింగ్‌పై విజయం కూడా సాధించారు.