ముంబై: ఒక వ్యక్తి ఏఐ వీడియోలతో ధనికుడిగా పోజులిచ్చాడు. విలాసవంతంగా జీవిస్తున్నట్లు ఉన్న ఏఐ వీడియోలను వాట్సాప్‌లో పోస్ట్ చేసేవాడు. ఆ వ్యక్తి రిచ్ పర్సన్‌గా భావించిన ఇద్దరు వ్యక్తులు పది లక్షలు దోచుకున్నారు. (Man robbed) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. సమీర్ యచల్వార్ అనే వ్యక్తి తాను చాలా రిచ్ పర్సన్‌గా ఇతరులను నమ్మించేందుకు ప్రయత్నించేవాడు. అపారమైన సంపదకు యజమానిగా ఏఐ ద్వారా వీడియోలు సృష్టించి వాట్సాప్‌లో పోస్ట్ చేసేవాడు.
కాగా, ఒక బిజినెస్ టూర్లో శ్రేయస్ బోర్కర్ అనే వ్యక్తి సమీర్‌కు పరిచయమయ్యాడు. అతడి వాట్సాప్ స్టేటస్ వీడియోలు చూసి సమీర్ నిజంగా అపార ధనికుడని నమ్మాడు. అతడి ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు, బంగారు ఆభరణాలు ఉంటాయని భావించాడు. తన సహచరుడితో కలసి సమీర్ ఇంట్లో దోపిడీకి ప్లాన్ వేశాడు. అతడు ఇంట్లో లేని సమయంలో రూ.4.5 లక్షల విలువైన నగలు, రూ.4 లక్షల డబ్బు చోరీ చేశాడు. ఆ తర్వాత సమీర్‌కు వాట్సాప్ కాల్ చేసి రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే అతడి భార్య, పిల్లలను చంపుతానని బెదిరించాడు.
మరోవైపు ఇంట్లో చోరి గురించి సమీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత తనకు వచ్చిన బెదిరింపు వాట్సాప్ కాల్ గురించి కూడా పోలీసులకు వెల్లడించాడు. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. సమీర్ ఇంటి నుంచి బ్యాగ్ విసిరేసిన వ్యక్తి వాహనం నంబర్ ద్వారా నిందితుడు శ్రేయస్గా పోలీసులు గుర్తించారు. తన అనుచరుడితో కలిసి అతడి ఇంట్లో దోపిడీకి ప్లాన్ వేసినట్లు తెలుసుకున్నారు.
అయితే నిందితులు ‘సైలెంట్ మోడ్’లో ఉన్న ఒక మొబైల్ ఫోన్‌ను సమీర్ బైక్‌లో దాచినట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. ఆ పరికరాన్ని ట్రాక్ చేయడం ద్వారా అతడు ఎప్పుడు ఇంటికి దూరంగా ఉన్నాడో తెలుసుకుని దోపిడీకి పాల్పడ్డారని పోలీస్ అధికారి తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.