ఇండోర్, ఏప్రిల్ 14: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణం జరిగింది. ఓ టీనేజీ మైనారిటీ బాలుడిని నగ్నంగా మార్చి, బలవంతంగా మతపరమైన నినాదాలు చేయించారు కొందరు. బొమ్మలు కొందామని చెప్పి బాలుడితో బలవంతంగా ఈ పని చేయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
45 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో నగ్నంగా కన్పిస్తున్న ఒక బాలుడు భయంతో బిగ్గరగా రోదిస్తూ కన్పించాడు. అతని చుట్టూ ఉన్న ముగ్గురు బాలురు అతడిని బెదిరించి మనదేశానికి అనుకూలంగా, పొరుగు దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. బాధితునితో పాటు మిగిలిన ముగ్గురూ కూడా అదే ప్రాంతానికి చెందిన వారని, బాధితుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిగిలిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే వారు మైనర్లు కావడంతో వారికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశామన్నారు. బాధితునితో పాటు, మిగిలిన ముగ్గురు బాలుర తల్లిదండ్రులు కూడా రోజువారీ కూలీలని చెప్పారు.