C295 aircraft : దేశీయ యుద్ధ విమాన తయారీ రంగంలో కీలక మలుపు చోటు చేసుకోనుంది. దేశీయంగా తయారు చేసిన ఎయిర్‌బస్ సీ295 అనే యుద్ధ విమానం త్వరలో అందుబాటులోకి రానుంది. అది కూడా ప్రైవేటు సంస్థ తయారు చేసిన విమానం ఇది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్స్ (టీఏసీఎల్) సంస్థ.. వడోదరలోని యూనిట్లో ఈ విమానాన్ని రూపొందించింది. ఈ విమానం అందుబాటులోకి వస్తే.. ఇంతకాలంగా ఏకఛత్రాదిపత్యం సాగించిన హెచ్ఏఎల్ (హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) సంస్థకు ధీటైన మరో సంస్థ వెలుగులోకి వచ్చినట్లే.
అయితే, హెచ్ఏఎల్ ప్రభుత్వ రంగ సంస్థ అయితే, టీఏసీఎల్ ప్రైవేటు సంస్థ. ఒక ప్రైవేటు సంస్థ యుద్ధ విమానాల్ని తయారు చేయడం దేశంలో ఇదే మొదటిసారి. ఎయిర్‌బస్ సీ295 విమాన తయారీ దాదాపు పూర్తి కావస్తోంది. మొత్తం 40 విమానాలు తయారు చేసే లక్ష్యంలో భాగంగా మొదటి విమానం తయారీ దాదాపు పూర్తైంది. ఇది అందుబాటులోకి వస్తే దేశీయ రక్షణ రంగానికి మరింత బలం చేకూరనుంది. ఇది అత్యంత ప్రభావవంతమైన విమానం. ఇదే తరహా విమానాన్ని ఇటీవల అమెరికా కూడా వాడింది. కొద్ది రోజుల క్రితం ఇరాన్లో చిక్కుకుపోయిన తమ సైనికుడిని రక్షించేందుకు అమెరికా ఉపయోగించిన విమానం ఇదే రకం. దీన్నిబట్టి ఈ విమానం ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ వీడియోకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.
అయితే, ఈ విమానం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది అనే విషయంలో కూడా స్పష్టత లేదు. గత జనవరిలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. మేడిన్ ఇండియా సీ295 ఎయిర్‌క్రాఫ్ట్ విమానం ఈ ఏడాది సెప్టెంబర్‌లోపు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అయితే, అంతకంటే ముందుగానే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. శుక్రవారం నాడు ఈ విమానాన్ని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ద ఎయిర్‌స్టాఫ్, ఎయిర్ మార్షల్ ఏకే భార్తి సందర్శించారు. ఇక్కడే విమానం తొలి టేకాఫ్ తీసుకోవడానికి సిద్దంగా ఉందని తెలుస్తోంది.
సీ295 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు సంబంధించి 2021లో ఇండియా, స్పెయిన్ మధ్య రూ.21,935 కోట్ల విలువ గల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇండియా ఇలాంటి 56 విమానాల్ని కొనుగోలు చేయాలి. అందులో 16 విమానాల్ని స్పెయిన్ అందిస్తుంది. మిగతా 40 విమానాల్ని ఇక్కడే తయారు చేస్తారు. ఇప్పటికే 16 విమానాలు ఇండియా చేరుకున్నాయి. ఇండియాలో రూపొందే విమానాల్లో 85 శాతం ఇక్కడే తయారు చేస్తారు. విమానానికి సంబంధించి మొత్తం 13,000 విడిభాగాలు తయారు చేస్తారు. ఈ విమానాలో రక్షణ రంగంలో అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అనేక దేశాల్లో కలిపి ప్రస్తుతం 300కు పైగా విమానాలు పని చేస్తున్నట్లు అంచనా.