అమృత్సర్: ఓ గూండా అనుచరుడిని అరెస్టు చేస్తే.. మిగతా అనుచరులంతా కత్తులు, తుపాకులతో పోలీసులపైకే దాడికి వెళ్లిన ఘటనలు సినిమాల్లోనే చూసుంటాం! అలాంటి ఘటనే అమృత్‌సర్‌లో చోటుచేసుకొన్నది. వివాదాస్పద మత గురువు, ‘వారిస్ పంజాబ్ దే’ ఖలీస్థానీ నేత అమృత్‌పాల్ సింగ్ అనుచరుడు లవ్‌ప్రీత్ తుఫాన్‌ను ఓ కేసులో పోలీసులు అరెస్టు చేశారు.
దీంతో రెచ్చిపోయిన వందలాది మంది అమృత్‌పాల్ అనుచరులు పోలీసులపైకి దండెత్తి వచ్చారు. అడ్డంగా పెట్టిన బారికేడ్లను తొలగిస్తూ వీరంగం సృష్టించారు. వెంటనే లవ్ప్రీత్ను విడుదల చేయాలని, ఎఫ్ఐఆర్ కొట్టేయాలని డిమాండ్ చేశారు. అమృత్‌పాల్ సింగ్ కూడా పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. గంటలో ఎఫ్ఐఆర్ కొట్టివేయకపోతే తర్వాత జరిగే పరిణామాలకు యంత్రాంగమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. అమృత్‌సర్‌లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీ స్థాయిలో బలగాలను మోహరించారు.