హైదరాబాద్ : నీట్-యూజీ (NEET-UG) పరీక్షల అక్రమాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ‘చలో పార్లమెంట్’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సీజేపీ మద్దతు దారులు బారికేడ్లను తోసుకొని పార్లమెంట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.
ఈ నేపథ్యంలో సీజేపీకి కేరళ ఎంపీలు మద్దతు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్, లోక్‌సభ ఎంపీ శశి థరూర్ సహా కేరళ ఎంపీలు, (సీజేపీ) చేస్తున్న నిరసనలకు తమ మద్దతును ప్రకటించారు. దేశ యువత భవిష్యత్తు కోసం ఈ ఉద్యమం ఒక దేశవ్యాప్త పోరాటానికి నిదర్శనమని సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నిరసన ప్రదేశానికి వెళ్లి సంఘీభావం తెలిపారు.
కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ శశి థరూర్ కూడా ఈ ఆందోళనకు తన మద్దతును ప్రకటించారు. సీజేపీ నిరసనకారులపై లాఠీఛార్జీలతో సహా పోలీసులు బలప్రయోగం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భేషజాలక పోకుండా నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.