Karnataka | ఒమిక్రాన్ నేపథ్యంలో కర్నాటకలో కూడా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే 10 రోజుల పాటు మాత్రమే విధిస్తున్నామని పేర్కొంది. డిసెంబర్ 28 నుంచి నైట్ కర్ఫ్యూ అందుబాటులో ఉంటుందని ఆరోగ్య మంత్రి సుధాకర్ ప్రకటించారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకూ ఈ నైట్ కర్ఫ్యూతో పాటు 144 సెక్షన్ కూడా అమలులో ఉంటుందని తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలు, పార్టీల విషయంలో కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఒమిక్రాన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మె అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… న్యూ ఇయర్ సందర్భంగా డీజేలు, గుంపులు గుంపులుగా గుమిగూడడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నామని, పెద్ద పెద్ద పార్టీలకు కూడా అనుమతి ఉండదని సీఎం బొమ్మై స్పష్టం చేశారు.