చెన్నై: తమిళనాడు రాజకీయం రసవత్తరంగా మారింది. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొన్నది. ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ సారథ్యంలో టీవీకే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను చేరకపోవడంతో ఇప్పుడు నంబర్ గేమ్ మొదలైంది. టీవీకేకు తాము మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. అయితే ఆ పార్టీకి కేవలం ఐదు సీట్లు మాత్రమే ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు మరో ఐదు సీట్లు అవసరం. దీంతో తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు తప్పనిసరిగా మారింది. ఇప్పుడు ఆ ఐదు సీట్ల మద్దతు ఎలా సాధించాలని విజయ్ పార్టీ కిందామీదా పడుతున్నది. ఇప్పటికిప్పుడైతే ఏవో పార్టీలు మద్దతు ప్రకటించవచ్చు. అయితే భవిష్యత్‌లో వాటి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కారాదని విజయ్ భావిస్తున్నారు. అందుకే విశ్వసనీయమైన పార్టీలనే తమ సంకీర్ణంలోకి తీసుకోవాలని అనుకుంటున్నారు.
ఐయూఎంఎల్, వామపక్షాలు ససేమిరా
విజయ్ బుధవారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను లోక్‌భవన్‌లో కలిశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లలో విజయం సాధించగా, ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు అవసరం. కాంగ్రెస్ సీట్లను కూడా కలుపుకుంటే ఆ పార్టీకి ఇంకో ఐదు సీట్లు కావాలి. అయితే సాంకేతికంగా చూస్తే విజయ్‌కు 10 కాదు 12 సీట్లు అవసరమవుతాయి. ఎందుకంటే విజయ్ రెండు చోట్ల విజయం సాధించడంతో ఒక సీటు తగ్గుతుంది. దీనికి తోడు ఆయన పార్టీ నుంచే స్పీకర్ ఎన్నికవుతారు కాబట్టి ఆయన ఓటు వేయరు. దీంతో విజయ్ పార్టీకి రెండు సీట్ల లోటు ఏర్పడుతుంది. కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలంటూ అన్నాడీఎంకేను సైతం టీవీకే నేతలు సంప్రదించారు. అయితే టీవీకేకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే బుధవారం స్పష్టం చేసింది.
పళనిస్వామి ఇంట్లో జరిగిన సమావేశం అనంతరం పార్టీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. టీవీకే నుంచి మద్దతు కోరుతూ లేఖ అందినట్లు రెండు సీట్లు గెల్చిన వీసీకే ఎంపీ రవికుమార్ ధ్రువీకరించారు. గురువారం పార్టీ సమావేశం నిర్వహిస్తున్నామని, సీనియర్ నేతల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తామని వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ చెప్పారు. ఇక వామపక్ష పార్టీలు, ఐయూఎంఎల్ విజయ్ పార్టీకి పొత్తు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశాయి. తాము డీఎంకేతో కొనసాగుతామని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. చిత్రంగా ఈసారి టీవీకే ఎన్నికల్లో డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు మాత్రమే రెండంకెల సీట్లను సాధించాయి. కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీలన్నీ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి.
విజయ్ ముందున్న ఆప్షన్స్ ఏంటి?
టీవీకే అధినేత విజయ్ ఈ నెల 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. అయితే సభలో బలాన్ని నిరూపించుకోమని గవర్నర్ ఆయనను తర్వాత కోరవచ్చు. దీనికి కొంత వ్యవధి ఉంటుంది కాబట్టి విజయ్ తగ్గిన సీట్ల సంఖ్య మేరకు మద్దతును సంపాదించుకోవచ్చు. ఒక వేళ నిరూపించుకోకపోతే పదవి నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే తమకు మద్దతు ఇవ్వమని వివిధ పార్టీలతో జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీలోని 234 సీట్ల సంఖ్య ప్రకారం క్యాబినెట్లో 35 మంది మంత్రులు ఉండవచ్చు. గత స్టాలిన్ ప్రభుత్వంలో 34 మంది మంత్రులు ఉండేవారు. మంత్రి పదవులు ఆశచూపి విజయ్ విపక్ష పార్టీల మద్దతు కూడగట్టే అవకాశం ఉంది.
చేతులు కలపనున్న డీఎంకే-అన్నాడీఎంకే?
చెన్నై: తమిళనాడు రాజకీయాలు అంతకంతకూ ఊహించని మలుపు తిరుగుతున్నాయి. దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి. టీవీకే అద్భుత విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతున్న తరుణంలో, ద్రవిడ రాజకీయాలను శాసించిన ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య రహస్య మంతనాలు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. తమిళ రాజకీయాల్లో నటుడు విజయ్ ఎంట్రీ ఓ సునామీ సృష్టించింది. ఆయన స్థాపించిన టీవీకే పార్టీ ఎన్నికల బరిలో అగ్రగామిగా నిలిచి, ద్రవిడ దిగ్గజాలను విస్మయానికి గురిచేసింది. ఈ అనూహ్య విజయంతో టీవీకే ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఇంతలో పాతతరం పార్టీలు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునే పనిలో పడ్డాయి.
ఒకప్పుడు ఉప్పు-నిప్పులా వ్యవహరించే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, పళనిస్వామి సారథ్యంలోని అన్నాడీఎంకే పార్టీల మధ్య ఇప్పుడు రహస్య చర్చలు నడుస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని దశాబ్దాలుగా శాసించిన ఈ రెండు బద్ధ శత్రువుల మధ్య ఇలాంటి సంప్రదింపులు జరగడం అత్యంత అరుదైన పరిణామం. మిత్రపక్షాలను కూడగట్టుకునే పనిలో విజయ్ టీవీకే వేగంగా దూసుకుపోతుండటంతో, దానిని నిలువరిం చే ఉద్దేశంతోనే డీఎంకే.. అన్నాడీఎంకేతో మంతనాలు ప్రారంభించినట్లు తెలుస్తున్నది. ఈ రహస్య చర్చలు నిజమేనని అన్నాడీఎంకే వర్గాలు సైతం ధృవీకరించినట్లు సమాచారం. చెరో రెండున్నరేండ్లు అధికారం పంచుకునేందుకు రెండు పార్టీలు యోచిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ రెండు పార్టీలు చేతులు కలిపితే మాత్రం, అది తమిళనాడు రాజకీయ చరిత్రలో ఊహించని మార్పుగా నిలిచిపోతుంది.
మొత్తం సీట్లు-234 మ్యాజిక్ ఫిగర్-118
ఏ పార్టీకి ఎన్ని సీట్లు