న్యూఢిల్లీ : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా తీవ్ర అనిశ్చితి పరిస్థితులు నెలకొనడంతో ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయుల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ దేశాన్ని వీడాలనుకుంటున్న భారతీయులను స్వదేశానికి రప్పించాలని నిర్ణయించింది. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్‌లోని బీర్షెబాలోని హాస్పిటల్‌ను ధ్వంసం చేసిన క్రమంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆ దేశం నుంచి రావాలనుకునే వారిని తొలుత భూభాగ సరిహద్దుల ద్వారా సురక్షిత ప్రాంతానికి తీసుకుని వెళ్లి, అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్‌కు తీసుకుని వస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటికే ఆపరేషన్ సింధు కింద ఇరాన్లో చిక్కుకుపోయిన మన పౌరులను భారత్‌కు తీసుకుని వస్తున్నట్టు పేర్కొంది. కాగా, యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులు ఆ దేశ అధికారులు జారీ చేసే సూచనలు, అదేశాలను తప్పక పాటించాలని టెల్ అవీవ్‌లోని భారత ఎంబసీ సూచించింది.