కాన్పూర్, డిసెంబర్ 25: గుండె జబ్బులతో బాధపడుతున్నవారికి ఐఐటీ కాన్పూర్ చల్లని కబురు చెప్పింది. తాము కృత్రిమ గుండెను తయారుచేసినట్టు ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కరందికర్ ఆదివారం ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నుంచి దీనిని జంతువులకు అమర్చి పరీక్షిస్తామని తెలిపారు. ఆ ప్రయోగం విజయవంతమైతే రెండేండ్లలో మనుషులకు అమర్చుతామని వెల్లడించారు.
ఐఐటీ కాన్పూర్‌కు చెందిన పది మంది శాస్త్రవేత్తలు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ హృద్రోగ వైద్యులతో కలిసి ఈ గుండెను తయారుచేసినట్టు పేర్కొన్నారు. గుండె మార్పిడి అవసరమైనవారికి ప్రస్తుతం ఇతరులు దానం చేస్తేనే లభిస్తున్నది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా తమ కృత్రిమ గుండె గొప్ప విజయమని అభయ్ తెలిపారు. గుండె వైద్యానికి సంబంధించిన పరికరాలు, స్టంట్ల వంటివి ప్రస్తుతం 80 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకొంటున్నామని చెప్పారు.