Strait of Hormuz : పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలోనూ హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పై అమెరికా, ఇరాన్ (US-Iran) తరచూ ఏదో ఒక ప్రకటన చేస్తూనే ఉన్నాయి. హర్మూజ్ నిర్వహణను ఇరానే (Iran) చూస్తుందని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ (Ghali buff) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ జలసంధి యుద్ధానికి ముందున్న స్థితికి ఎప్పటికీ తిరిగిరాదన్నారు. తాము అమెరికన్లను ఎన్నడూ నమ్మలేదని, ఇప్పుడూ నమ్మడం లేదని చెప్పారు. భవిష్యత్తులోనూ వారిపట్ల ఆ ధోరణితో ఉండటం సమంజసమేనని ఘాలిబఫ్ అమెరికా పట్ల ఇరాన్‌కున్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
స్విట్జర్లాండ్‌లో ఇప్పటికే రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఫ్రీజ్ చేసిన 12 బిలియన్ డాలర్ల ఇరాన్ ఆస్తులను విడుదల చేయడానికి తుది ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. కాగా తమ నుంచి సోయా, మొక్కజొన్న, గోధుమలు కొనేందుకు ఇరాన్ అంగీకరిస్తే ఫ్రీజ్ చేసిన ఆ దేశ ఆస్తులను విడుదల చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన చేసింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్‌పై భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ పూర్తిగా తెరిచే ఉందని ప్రకటించారు. ఈ జలసంధికి మరోవైపున ఉన్న ఒమన్ దేశం తాజా పరిణామాలపై స్పందించింది.
అంతర్జాతీయ చట్టాలకు, టోల్ రహిత ప్రయాణానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై నిర్మాణాత్మక చర్చలు జరిగాయని పేర్కొన్నది.