Tamilnadu | తమిళ సస్పెన్స్‌కు శుభం కార్డు!.. ప్రభుత్వ ఏర్పాటుపై విజయ్‌కు గవర్నర్ ఆర్లేకర్ అనుమతి
తమిళనాడులో రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు శనివారం తెర పడింది. టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు తెలియచేస్తూ లేఖలు అందచేయడంతో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది.
- నేడు ఉదయం 10 గంటలకు సీఎంగా ‘దళపతి’ ప్రమాణం
- టీవీకేకు కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్, ఐయూఎంఎల్ మద్దతు
చెన్నై, మే 9: తమిళనాడులో రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు శనివారం తెర పడింది. టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు తెలియచేస్తూ లేఖలు అందచేయడంతో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమిళగ వెట్రి కళగం(టీవీకే) శాసనసభా పక్ష నేత విజయ్‌కు రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ శనివారం ఆమోదం తెలిపారు. దీంతో ఆదివారం ఉదయం 10 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. వివిధ పార్టీల నుంచి పొందిన సంతకాలతో కూడిన మద్దతు లేఖలను విజయ్ గవర్నర్‌కు సమర్పించడంతో ఐదు రోజులుగా సాగుతున్న హైడ్రామాకు ఎండ్ కార్డ్ పడింది.
సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే అధినేతకు విడుతలై చిరుతైగళ్ కట్చి(వీసీకే), సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు బేషరతు మద్దతు ప్రకటించిన అనంతరం విజయ్ టీవీకే సీనియర్ నాయకులతో కలసి 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్‌కు సమర్పించారు. అయితే ఆయనతోపాటు మంత్రివర్గంలోకి ఎంతమంది మంత్రులు చేరతారనే దానిపై అనిశ్చితి నెలకొని ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం కోరుతూ ఒక వారం వ్యవధిలో గవర్నర్‌తో విజయ జరిపిన నాలుగవ సమావేశం ఇది.
ఎమ్మెల్యేల నుండి అవసరమైన మద్దతు లేఖలు పొందలేకపోవడంతో ఆయన గత రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. రోజుల తరబడి జరిగిన తీవ్రమైన చర్చల అనంతరం తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడిది. డీఎంకే మిత్రపక్షాలు చివరకు విజయ్ పార్టీకి మద్దతు పలకడంతో అసెంబ్లీ సంఖ్యాబలంలో సగం మార్కును టీవీకే దాటగలిగింది. అయితే, ఈ కూటమికి కేవలం 120 మంది ఎమ్మెల్యేలతోనే స్వల్ప మెజారిటీ ఉంది. టీవీకేకు చెందిన పలువురు కార్యకర్తలు, మద్దతుదారులు తాజా పరిణామాలపై సంబరాలు జరుపుకున్నారు. చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయం బయట బాణసంచా కాల్చారు.
టీవీకేపై ఏఏఎంకే విమర్శలు
డీఎంకే మిత్రపక్షాల మద్దతు కూడగట్టడంలో తీవ్రంగా శ్రమించిన టీవీకే బేరసారాలకు ప్రయత్నిస్తోందని ఎన్డీయే మిత్రపక్షమైన అమ్మ మక్కళ్ మున్నేట్ర కళగం(ఏఏఎంకే) నుంచి కూడా విజయ్ పార్టీ విమర్శలను ఎదుర్కొంది. ఈ రాజకీయ పరిణామాలు తమిళనాడులో రిసార్ట్ రాజకీయాల పునరాగమనానికి కూడా దారితీశాయి. 2016లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత చివరిసారిగా అటువంటి పోకడలు కనిపించాయి. టీవీకేకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించగా టీవీకే శాసనసభ్యులకు చెన్నై సమీపంలోని మామల్లపురంలోని ఒక రిసార్ట్‌లో వసతి కల్పించారు. విజయ్ నేతృత్వం వహించనున్న మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవితోసహా పలు కీలక పదవులపై వీసీకే కన్నేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
రాష్ట్రపతి పాలన రాకూడదనే మద్దతు: వీసీకే చీఫ్
తమిళనాడులో రాష్ట్రపతి పాలన రాకుండా అడ్డుకునేందుకు, టీవీకేకు అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పును నెరవేర్చేందుకు తాము విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు వీసీకే చీఫ్ తోల్ తిరుమావలవన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగిన మెజారిటీ లేనందున, మిగిలిన ఏ పార్టీ కూడా అధికారాన్ని ఏర్పాటు చేసే మేజిక్ ఫిగర్‌కు దగ్గరగా లేనందున తామీ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి అని టీవీకే ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జునకు తమ మద్దతు లేఖ అందించిన అనంతరం ఆయన మీడియాతో తెలిపారు.
ప్రస్తుతం తాము తీసుకున్న ఈ మద్దతు నిర్ణయం ద్వారా డీఎంకే కూటమితో తమకు ఉన్న సంబంధ బాంధవ్యాలపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. రాష్ట్రపతి పాలనను నిరోధించడానికి, విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే తాము మద్దతు ఇస్తున్నామన్నారు. డీఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమితో తమ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు తాము అడ్డంకి కాకూడదని భావించామని దళిత వాద పార్టీ నాయకుడు తిరుమావలవన్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

