ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్’ సందర్భంగా భారీ డిస్కౌంట్లు లభిస్తాయని అందరికీ తెలిసిందే. అందుకే ఈ సమయంలో ఫ్లిప్‌కార్ట్ సేల్స్ ఆకాశన్నంటుతాయి. ఈ క్రమంలో తండ్రి కోసం ల్యాప్‌టాప్ ఆర్డర్ చేసిన ఒక యువకుడికి దిమ్మతిరిగే షాకిచ్చింది ఫ్లిప్‌కార్ట్. మంచి డిస్కౌంట్లో ల్యాప్‌టాప్ ఆర్డర్ ఇస్తే.. డిటర్జెంట్ సోప్‌లు పెట్టిన డెలివరీ వచ్చింది.
తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న యశస్వి శర్మ.. ఫ్లిప్‌కార్ట్ ఇచ్చిన డెలివరీని తన తండ్రి తీసుకున్నట్లు వెల్లడించాడు. ఫ్లిప్‌కార్ట్ ‘ఓపెన్ బాక్స్ డెలివరీ’ నిబంధన ప్రకారం వస్తువులు డెలివరీ ఇచ్చే సమయంలో డెలివరీ ఏజెంట్ ముందే దాన్ని మనం ఓపెన్ చేయాలి. అప్పుడు డెలివరీ వచ్చిన వస్తువులో ఏదైనా లోపం ఉంటే.. రిటర్న్ చేయొచ్చు.
ఈ విషయం యశస్వి తండ్రికి తెలియదు. దీంతో ఆయన ఓటీపీ చెప్పి డెలివరీ తీసుకున్నారు. కానీ బాక్సు లోపల డిటర్జెంట్ సోప్‌లు ఉండటంతో షాకయ్యాడు. తన తండ్రిలాగే చాలా మందికి ఈ డెలివరీ నిబంధన గురించి తెలియదని చెప్పిన యశస్వి.. ఇదే విషయాన్ని ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కు చెప్తే తాము ఏం చెయ్యలేమని చేతులెత్తేశారని చెప్పాడు.
దీంతో తమ కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని యశస్వి వెల్లడించాడు. ఈ క్రమంలో ఇటీవల తమను ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ సంప్రదించారని, రిఫండ్ ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారని, కానీ ఇప్పటి వరకు తన డబ్బు తిరిగి రాలేదని పోస్టు చేశాడు. ఈ డెలివరీ పంపిన సంస్థపై కూడా చర్యలు తీసుకుంటామని ఫ్లిప్‌కార్ట్ అధికారులు చెప్పారు.
ఓపెన్ బాక్స్ డెలివరీ: ఈ పద్ధతిలో డెలివరీ ఇచ్చే సమయంలో డెలివరీ ఏజెంట్ తను తీసుకొచ్చిన ప్యాకేజీ ఓపెన్ చేసి కస్టమర్‌కు చూపిస్తాడు. తను ఆర్డర్ చేసిన వస్తువే వచ్చిందా? వచ్చిన వస్తువు ఏమైనా డ్యామేజీ అయిందా? అని పరిశీలించిన తర్వాత కస్టమర్ సంతృప్తి చెందితేనే ఓటీపీ చెప్పి వస్తువు తీసుకోవాలి. ఏమైనా సమస్య ఉంటే డెలివరీని రిజెక్ట్ చేయవచ్చు. ఇలా చేస్తే కస్టమర్‌కు ఎలాంటి సమస్య ఉండదు. ఇలాంటి విధానాల ద్వారా కస్టమర్లపై భారం పడకుండా, నాణ్యమైన సప్లై చైన్ సృష్టించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.