బెంగుళూరు: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో జనతాదళ్(సెక్యులర్) ఒంటరిగా పోటీ చేయనున్నది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ(HD Deve Gowda) తెలిపారు. ఎన్డీఏతో ఎటువంటి కూటమి ఉండదని ఆయన స్పష్టం చేశారు. బెంగుళూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తుందని, అయిదు లేదా ఆరు లేదా ఒక్క సీటు గెలిచినా పర్వాలేదని దేవగౌడ తెలిపారు. బలంగా ఉన్న చోటే తమ అభ్యర్థుల్ని నిలబెడతామన్నారు. అయితే దేవగౌడ కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి.. కొన్ని రోజుల క్రితం వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్‌ను ఢీకొనేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోనున్నట్లు కుమారస్వామి తెలిపారు. అయితే దానికి విరుద్ధంగా దౌవగౌడ కామెంట్ చేశారు. తాజాగా జరుగుతున్న కర్నాటక అసెంబ్లీ సమావేశాలను జేడీఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు బాయ్‌కాట్ చేశారు. పది మంది బీజేపీ నేతల్ని సస్పెండ్ చేయడంతో ఆ రెండు పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.