న్యూఢిల్లీ, ఆగస్టు 25 : శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడానికి, చమురు దిగుమతులను నియంత్రించడానికి, విదేశీ మారకద్రవ్యాన్ని పరిరక్షించడానికి అంటూ ఇథనాల్-20ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం అందుకయ్యే వ్యయాన్ని దేశ ప్రజలపై ముఖ్యంగా పేదలపై మోపుతున్నది. ఇంధన భద్రత పేరిట చేపట్టిన ఈ కార్యక్రమం భారంగా మారుతున్నది. ఇప్పటికే చక్కెర ధరలు ఆకాశాన్నంటుతుండగా, సాగు నీరు, ఆహార వనరులు కూడా దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. తక్కువ వ్యయంతో అధిక ఉత్పత్తి ఏ రంగంలోనైనా లాభదాయకంగా ఉంటుంది. కానీ కొండను తవ్వి ఎలుకను పట్టిన రీతిగా ఎంతో విలువైన సహజ వనరులు, ఆహార ఉత్పత్తులను వినియోగించి ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బ్రెజిల్లో ఈ ప్రయోగం ఇప్పటికే విఫలమైనట్టు తెలుస్తున్నది. భారత్‌లో సైతం ఇథనాల్ వినియోగం వెనుక మూడు అంతర్లీన అంశాలు దాగి ఉన్నాయి. మొదటిది ఆహార వనరుల మళ్లింపు కాగా, రెండోది సాగు నీరు, భూమిపై పడే ఒత్తిడి, మూడోది వాహనాలపై పడే సాంకేతిక భారం. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల ఇప్పటికే మైలేజీ తగ్గుతున్నదని, ఇంజిన్‌కు ఆయిల్‌ను సరఫరా చేసే పైపులు తుప్పు పడుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. కానీ ఇంతకంటే పెద్ద నష్టమే జరుగుతున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. తమ విధానాన్ని ‘జాతీయ ప్రయోజనం’గా ప్రచారం చేసుకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ నష్టాన్ని ఎవరిపై మోపుతున్నదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
భారత ఇథనాల్ మార్కెట్లో ప్రభుత్వరంగ సంస్థలతోపాటు ప్రైవేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే ఈ కంపెనీలన్నీ ఉత్పత్తి చేసే ఇథనాల్‌ను కొనుగోలు చేసేది మాత్రం ప్రభుత్వ కంపెనీలే. కాబట్టి, అవే ధరలను, కోటాను, సరఫరాను నిర్దేశిస్తాయి. ప్రభుత్వం బ్లెండింగ్ లక్ష్యాన్ని నిర్దేశించినప్పుడు, దాన్ని చేరుకోవడానికి అవసరమైన ఇథనాల్‌ను కొనుగోలుచేసే బాధ్యత ప్రభుత్వ కంపెనీలదే. అంటే సామాజిక లేదా పర్యావరణ నష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు ఉత్పత్తిదారులకు మార్కెట్ హామీ ఇవ్వాలి. అంతిమంగా ప్రైవేట్ ఉత్పత్తిదారులు లాభాలు పొందుతుండగా.. ప్రభుత్వ సంస్థలు మార్కెట్ రిస్క్‌ను భరించాల్సి ఉంటుంది. ఇక సామాజిక, పర్యావరణపరమైన నష్టాలు మాత్రం సామాన్యులపై పడతాయి.
భారత్‌లో ఇథనాల్ లక్ష్యాన్ని సాధించేందుకు సుమారు 80 లక్షల హెక్టార్ల సాగు భూమి కావాలి. ఈ స్థాయిలో భూమి కావాలంటే పంటల సాగు అడవుల అంచుల వరకూ విస్తరించాలి. అదే జరిగితే భూమిలో నిల్వ ఉన్న కార్బన్ విడుదలై.. ఇథనాల్ ద్వారా ఒనగూరే వాతావరణ ప్రయోజనాలను దెబ్బతీయవచ్చు అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక అధిక దిగుబడి కోసం రైతులు వాడే ఎరువులు, భూగర్భ జలాల వినియోగం వల్ల పర్యావరణానికి మరింత నష్టం జరుగుతుందని అంటున్నారు. ఇథనాల్ వల్ల వాహన ఉద్గారాల తగ్గుదల మాటేమో కాని జరిగే నష్టమే ఎక్కువ అని వాపోతున్నారు. సాంకేతికపరమైన భారం ఏప్రిల్ 2023కు ముందు తయారైన, కార్బొరేటర్ కలిగిన వాహనాలు ఇథనాల్‌కు సర్దుబాటు కాలేవు. వీటి మైలేజీ 20 శాతం వరకు తగ్గుతుంది.
2025-26లో మూడు ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు రూ.49,577 కోట్ల వ్యయంతో 705.43 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను కొనుగోలు చేశాయని కేంద్రం వెల్లడించింది. గత మూడేండ్లలో ఆయిల్ కంపెనీలు ఇథనాల్ సేకరణకు రూ.1.72 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేశాయి. మరోవైపు ప్రభుత్వం దేశ ఆహార అవసరాలు తీరిన తరువాతనే మిగులు నిల్వలను ఇథనాల్ తయారీకి మళ్లిస్తున్నట్టు చెప్తున్నది. తద్వారా చమురు దిగుమతికి అయ్యే విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడుతున్నట్టు పేర్కొంటున్నది. కానీ ప్రభుత్వం చెప్తున్న ఆ ‘మిగులు’కు అయ్యే వ్యయం విస్తుగొలుపుతున్నది. భారత ఆహార సంస్థ రైతుల నుంచి కిలో రూ.44 చొప్పున బియ్యం సేకరిస్తుంది. ఆ బియ్యాన్ని ఇథనాల్ డిస్టిల్లరీలకు కిలో రూ.23 చొప్పున విక్రయిస్తున్నది. తద్వారా ఆహార భద్రత కోసం కేటాయించిన ప్రజా ధనం.. ప్రైవేట్ వాహనాలకు ఇంధన రాయితీగా మారిపోతున్నది. మక్కజొన్నను సైతం ఇథనాల్ ఉత్పత్తిలోకి గుంజుతున్నారు. దీంతో రైతులు మక్కజొన్న సాగువైపు మరలుతున్నారు. ఈ పరిణామం అత్యవసరమైన ఆహార పదార్థాల కొరతకు దారితీస్తున్నది.