చెన్నై, జూన్ 26: భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకు కూడా సమాన హక్కు, వాటా ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. భర్త సంపాదనలో భార్యకు పరోక్ష భాగస్వామ్యం ఉంటుందని పేర్కొన్నది. కుటుంబ బాధ్యతలు చూసుకోవడంలో భాగంగా పిల్లల సంరక్షకురాలిగా, ఇంటి ఫైనాన్షియల్ మేనేజర్‌గా, వంట మనిషిగా, ఫ్యామిలీ డాక్టర్‌గా ఇలా ఆమె నిర్వర్తించే ‘వివిధ పాత్రలు’ భర్త రోజుకు చేసే 8 గంటల డ్యూటీకి ఎంత మాత్రం తక్కువ కాదని అభిప్రాయపడింది. ఈ మేరకు కుటుంబ నిర్వహణలో భార్య పాత్రను, ఆమె కృషిని వివరిస్తూ ఓ ఆస్తి వివాదం కేసులో జస్టిస్ క్రిష్ణన్ రామస్వామి తాజాగా తీర్పునిచ్చారు.మరణించిన తన భర్త పేరిట ఉన్న ఆస్తుల్లో సమాన వాటా కల్పించాలని కోరుతూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త సంపాదన విషయంలో భార్యకు ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా భాగస్వామ్యం ఉంటుందని, ఇంటిని నడుపడంలో కీలక పాత్ర పోషిస్తుందని జడ్జి పేర్కొన్నారు. ‘ఉద్యోగ రీత్యా బయటకు వెళ్లే భర్తకు ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం కలుగకుండా.. పిల్లలను చూసుకోవడం, వంట, క్లీనింగ్ దగ్గరి నుంచి కుటుంబ నిర్వహణకు సంబంధించిన రోజువారీ వ్యవహారాలు దాదాపుగా ఆమెనే చూసుకుంటుంది. ఈ క్రమంలో ముఖ్యంగా ఆమె తన కలలను కూడా త్యాగం చేసి, తన జీవితం మొత్తాన్ని కుటుంబం, పిల్లల కోసమే గడుపుతుంది’ అంటూ ఇల్లాలి పాత్రను వివరించారు. ‘సాధారణంగా వివాహ వ్యవస్థలో భార్య పిల్లలను కంటుంది, వారిని పెంచుతుంది, ఇంటి పనులను చూసుకొంటుంది. అయితే ఇంటి పనులను భార్య సక్రమంగా నిర్వర్తిస్తుండటం వల్లనే, భర్త బయటకు వెళ్లి ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛగా ఉద్యోగం లేదా పని చేసుకొని సంపాదించుకొని వస్తున్నాడు’ అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అటువంటి ఆమెకు సంపాదన ఫలాలను పంచుకొనే హక్కు ఉన్నదని, అదే న్యాయమని వ్యాఖ్యానించారు.
ఇంటి మేనేజర్‌గా.. చెఫ్‌గా!
భార్య ఒక గృహిణిగా మేనేజర్, చెఫ్ వంటి పాత్రలతో పాటు ‘కుటుంబ డాక్టర్’, ఇంటి ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించే ‘ఆర్థికవేత్త’గా కూడా పనిచేస్తుందని జడ్జి పేర్కొన్నారు. ఈ నైపుణ్యాలతో ఒక ఇల్లాలు, తన ఇంటిని సౌకర్యవంతమైన వాతావరణంలో ఉంచుతుందని అన్నారు. బయటకు వెళ్లి సంపాదించే భర్త రోజుకు 8 గంటలు పనిచేస్తే.. అదే భార్య సెలవు అనేది లేకుండా ఇంటిలో 24 గంటలూ అందుకు ఏమాత్రం తక్కువ కాకుండా పనిచేస్తుందని చెప్పారు. కుటుంబం అనే బండికి భర్త, భార్య రెండు చక్రాలు లాంటి వాళ్లని, ఇద్దరి కృషితో వచ్చే సంపాదనలో సమాన హక్కు ఉంటుందని ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పష్టం చేశారు. ప్రస్తుత కేసులో భార్య లేకుంటే, భర్త విదేశాలకు వెళ్లి సంపాదించగలిగే వాడు కాదని, ఈ నేపథ్యంలో నిర్దిష్ట స్థిరాస్తిలో సమాన వాటా ఇవ్వాలని ఆదేశించారు.