Canada PM justin trudeau : కరోనా వ్యాక్సిన్ను తప్పనిసరి చేస్తూ కెనడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తప్పనిసరి విధానాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. శనివారం చిన్నగా ప్రారంభమైన ఈ నిరసన ప్రదర్శలు, ఆదివారం నాటికి తార స్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వానికీ, ప్రధానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. దాదాపు 50 వేల మంది ట్రక్కు డ్రైవర్లు ప్రధాని నివాసాన్ని చుట్టముట్టారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి అదుపు తప్పే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రధాని, ఆయన కుటుంబం రాజధానిని విడిచిపెట్టేశాయి. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వ్యాక్సిన్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను అక్కడి ప్రజలు ఫాసిస్టు చర్యతో అభివర్ణించారు. ఈ చర్య దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విధించిన నిబంధన కాదని, కేవలం ప్రజలపై ఆంక్షలు విధించడానికే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిరసనకారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.
కరోనా నేపథ్యంలో అమెరికాకు వెళ్లి వచ్చే ట్రక్కు డ్రైవర్లు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని కెనడా ప్రభుత్వం నిబంధన విధించింది. అలాగే వలస వచ్చే వారికి నాలుగు రోజుల పాటు క్వారంటైన్ తప్పనిసరి అని కూడా నిబంధన విధించింది. దీంతో ట్రక్కు డ్రైవర్లు ప్రభుత్వ నిబంధనను వ్యతిరేకిస్తూ కొన్ని రోజులుగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కెనడా ట్రక్కు డ్రైవర్లకు మద్దతుగా ప్రజలు కూడా ఆందోళనల్లో భాగస్వామ్యం పంచుకున్నారు. దీంతో పరిస్థితి మరింత విషమించింది. ఇప్పటికే కరోనా ఆంక్షలు విపరీతంగా పెరిగిపోయాయని, దీంతోనే తాము విసుగుచెందామని కూడా ఆందోళనకారులు పేర్కొంటున్నారు.