లక్నో: ఒక పోలీస్ కానిస్టేబుల్ తన భార్య ప్రియుడ్ని, అతడి స్నేహితుడ్ని కత్తితో పొడిచి చంపాడు. (Cop kills wife’s lover) అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతడి భార్య కూడా గాయపడింది. జంట హత్యలపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో ఈ సంఘటన జరిగింది. తన భార్యకు ఆమె ప్రియుడు మనోజ్‌తో వివాహేతర సంబంధం ఉందని పోలీస్ కానిస్టేబుల్ మహేంద్ర కుమార్ అనుమానించాడు. దీంతో మార్చి 31న తన భార్యతో ఫోన్ చేయించి అతడ్ని రప్పించాడు. ఆమెను కలిసిన తర్వాత తిరిగి వెళ్తున్న మనోజ్‌పై కత్తితో దాడి చేశాడు. సుమారు 20 సార్లు పొడిచి దారుణంగా హత్య చేశాడు. మనోజ్ వెంట వచ్చిన అతడి స్నేహితుడు రోహిత్ లోధి మెడపై కత్తితో పొడిచి చంపాడు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్య కూడా గాయపడింది. ఆమె చేతి వేలు తెగింది.
కాగా, జంట హత్యల తర్వాత మనోజ్, రోహిత్ మృతదేహాలను లఖింపూర్‌లోని నగ్వా వంతెన సమీపంలో పోలీస్ కానిస్టేబుల్ మహేంద్ర కుమార్ పడేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. మృతదేహాలను గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో మహేంద్ర కుమార్ ఆచూకీ తెలుసుకుని అరెస్ట్ చేశారు. అతడి భార్యను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.