High Court | బెంగళూరు: ఓ మహిళ వేరొక పురుషునితో శృంగార సంబంధానికి అంగీకరించడాన్ని ఆమెపై దాడి చేయడానికి ఆ పురుషుడికి ఇచ్చిన లైసెన్స్‌గా పరిగణించరాదని కర్ణాటక హైకోర్టు చెప్పింది. ఓ కానిస్టేబుల్ భార్య సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు. ఆమె 2017లో ఓ కేసు విషయంలో ఇతరులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినపుడు అక్కడి సర్కిల్ ఇన్స్పెక్టర్తో ఆమెకు పరిచయమైంది. అనంతరం ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. 2021 మే నెలలో ఆమె సీఐపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై సదరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శారీరక, లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈ కేసును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తన పిల్లలను చంపేస్తానని ఆ సీఐ తనను బెదిరించారని ఆమె వెల్లడించారు. దీనిపై ఆమె 2021 సెప్టెంబరులో మరో ఫిర్యాదు చేశారు.
సీఐ అదే ఏడాది నవంబర్‌లో తనను ఓ హోటల్‌కు తీసుకెళ్లి, బలవంతంగా లైంగిక దాడి చేసి కొట్టి, తెల్లవారుజామున ఓ బస్టాప్ వద్ద వదిలేశారని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణపై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. నిందితుడైన సీఐ ఈ ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేశారు. 2017 నుంచి 2022 వరకు తామిద్దరమూ ఇష్టపూర్వకంగా శృంగారం చేశామన్నారు. సీఐ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు చెప్తూ, పిటిషనర్, ఫిర్యాదిదారు ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొన్నారని, పదే పదే అత్యాచారం చేసినట్లు మోపిన నేరారోపణను అంగీకరించలేమని చెప్పింది. అయితే, హత్యాయత్నం, దాడి, నేరపూరిత బెదిరింపులు వంటి ఆరోపణలకు బలం ఉందని, వాటిపై విచారణను కొనసాగించవచ్చునని తెలిపింది. ఫిర్యాదుదారుపై నిందితుడు స్త్రీ ద్వేషంతో కూడిన క్రూరత్వం ప్రదర్శించినట్లు కనిపిస్తున్నదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సహ జీవన సంబంధాలకు సమాజ ఆమోదం లేనప్పటికీ, యువత అటు వైపు ఆకర్షితులవుతున్నందు వల్ల సమాజంలో నైతిక విలువలను కాపాడటం కోసం ఓ క్రమబద్ధమైన విధానాన్ని, పరిష్కారాన్ని కనుక్కోవాల్సిన సమయం వచ్చిందని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. స్త్రీ, పురుషులు తమ భాగస్వామి పట్ల బాధ్యతను తప్పించుకోవడం కోసం ఇలాంటి సంబంధాల వైపు మొగ్గు చూపడం పెరుగుతున్నదని తెలిపింది. పెండ్లి పేరుతో ఓ మహిళతో శారీరక సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణపై ఆకాశ్ కేసరి అనే వ్యక్తిపై కేసు నమోదైంది. ఆయనకు బెయిలు మంజూరు చేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కేసరి తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఆరోపణలు చేసిన మహిళను పెండ్లి చేసుకుంటానని కేసరి చెప్పలేదన్నారు.