ముంబై: వీడియోకాన్-ఐసీఐసీఐ బ్యాంక్ మనీలాండరింగ్ కేసులో నిందితులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మూడు రోజుల సీబీఐ కస్టడీ విధించింది. ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ నిందితులుగా, వీడియోకాన్ కంపెనీ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ సహనిందితుడిగా ఉన్నారు.
చందాకొచ్చర్, దీపక్ కొచ్చర్లను గత శుక్రవారం అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు మూడు రోజులు కస్టడీలోకి తీసుకుని శని, ఆది, సోమవారాల్లో విచారించారు. ఇవాళ ఉదయం వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌ను కూడా అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు నిందితులు ముగ్గురిని ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు.
ఈ సందర్భంగా కొచ్చర్ దంపతులను మరో మూడు రోజులు తమ కస్టడీకి అప్పగించాలని, అదేవిధంగా వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌కు కూడా మూడు రోజుల సీబీఐ కస్టడీ విధించాలని అధికారులు కోరారు. సీబీఐ విజ్ఞప్తి మేరకు స్పెషల్ కోర్టు న్యాయమూర్తి నిందితులు ముగ్గురికి మూడు రోజులపాటు సీబీఐ కస్టడీ విధించారు.