చెన్నై: తమిళనాడు సీఎం విజయ్‌తో పాటు మాజీ సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కూడా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి శుక్రవారం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో రాహుల్‌ను ‘ఆదర్శ సోదరుడి’గా అభివర్ణించిన స్టాలిన్ ఈసారి కేవలం ప్రతిపక్ష నేతగా పరిగణించారు. సీఎం విజయ్ మాత్రం రాహుల్‌ను ‘సోదరుడి’గా పేర్కొన్నారు. (MK Stalin’s Wish For Rahul) తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంతో పాటు ప్రభుత్వంలో చేరింది. దీంతో ఆ రాష్ట్రంలో మిత్రపక్షమైన డీఎంకే, కాంగ్రెస్ మధ్య రాజకీయ సంబంధాలు దెబ్బతిన్నాయి. కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని, వెన్నుపోటు పొడిచిందని డీఎంకే ఆరోపించింది.
కాగా, ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఎంకే స్టాలిన్ ఎక్స్‌లో శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే గత ఏడాది, ఈసారి విషెస్‌లో భారీ మార్పు కనిపించింది. రాహుల్ గాంధీ గత పుట్టిన రోజున ‘నా ఆదర్శ సోదరుడు, రక్త సంబంధంతో కాదు, ఆలోచన, దార్శనికత, లక్ష్యంతో ముడిపడి ఉన్నాం’ అని నాడు సీఎంగా ఉన్న స్టాలిన్ అభివర్ణించారు. ఈసారి మాత్రం ‘గౌరవనీయ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నా’ అని స్టాలిన్ పేర్కొన్నారు.

Stalin Wishes To Rahul
మరోవైపు తమిళనాడులో కాంగ్రెస్‌తో కొత్తగా పొత్తుపెట్టుకున్న టీవీకే చీఫ్, సీఎం విజయ్ కూడా రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్ తెలియజేశారు. అయితే రాహుల్‌ను ‘సోదరుడు’ అని ఆయన సంబోధించారు. ‘మన గొప్ప దేశమైన భారతదేశ ప్రగతి కోసం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం కోసం, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం గళం విప్పుతున్న మీకు, మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు, మీరు చేపట్టే అన్ని ప్రయత్నాలలో విజయం, ప్రజా జీవితంలో విశిష్టంగా సేవ చేయగల సామర్థ్యం కలగాలని నేను ఆకాంక్షిస్తున్నా’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
కాగా, సీఎం విజయ్‌తో పాటు స్టాలిన్ విషెస్‌కు రాహుల్ గాంధీ స్పందించారు. టీవీకేతో కొత్త బంధాన్ని కొనసాగిస్తూనే డీఎంకేతో సయోధ్య కోసం ఆయన ప్రయత్నించారు. శుభాకాంక్షలు చెప్పిన స్టాలిన్‌కు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. ‘భారతదేశ భావన, మన రాజ్యాంగాన్ని, సమాఖ్య వ్యవస్థను పరిరక్షించాలనే మన ఉమ్మడి సంకల్పం మనకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది. ఇది మన ప్రజాస్వామ్య ఆత్మను కాపాడుకునే పోరాటం. విజయం సాధించే వరకు మనం కలిసి ఈ పోరాటాన్ని సాగిస్తాం’ అని పేర్కొన్నారు.
అయితే సీఎం విజయ్ విషెస్‌కు రిప్లైలో ‘రాజ్యాంగం పట్ల, మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం పట్ల మన నిబద్ధతలో మనం ఐక్యంగా ఉన్నాం. అలాగే తమిళనాడు ప్రజల సంక్షేమం, గౌరవం, ఆకాంక్షల కోసం మనం కలిసి కృషి చేస్తూనే ఉంటాం’ అని రాహుల్ స్పందించారు.

Rahul Replay To Stalin And Vijay