అంబేద్కర్ జయంతి (Ambedkar birth anniversary)..! భారతదేశంలో ఏడాదికి ఒక్కసారి పండుగలా జరుపుకునే మహోత్సవం..! డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr BR Ambedkar) పుట్టినరోజును పురస్కరించకుని ఏటా ఏప్రిల్ 14న ఈ మహోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నారు…! బాబాసాహెబ్ అంబేద్కర్గా కూడా బీఆర్ అంబేద్కర్ పేరు సుపరిచితం..! డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ అసాధారణ వ్యక్తి. వ్యక్తి అనడం కంటే ఆయనను ఒక శక్తిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన భారత దేశపు న్యాయవేత్త.. ఆర్థికవేత్త.. సంఘ సంస్కర్త.. రాజకీయవేత్త.. అన్నింటికి మించి భారత రాజ్యాంగ రూపకర్త. అంతటి మహనీయుడి జీవితం గురించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం..
ఆరేళ్లకే తల్లి మరణం..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రకు చెందిన మెహర్ కులంలో రామ్‌జీ మాలోజీ సక్పాల్, భీమాబాయ్ రామ్‌జీ సక్పాల్ దంపతులకు ఆఖరి సంతానంగా జన్మించారు. ఆయన తండ్రి రామ్‌జీ మాలోజీ సక్పాల్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్‌గా పనిచేసేవారు. అంబేద్కర్‌కు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆయన ఆర్మీ నుంచి పదవీ విమరణ పొందారు. ఆయనకు ఆరేళ్ల వయస్సప్పుడు తల్లి భీమాబాయ్ మరణించారు. సతారాలో ఆయన పాఠశాల విద్య ప్రారంభమైంది. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో పినతల్లి ఆయన బాగోగులు చూసింది.
చిన్న వయస్సులోనే కులవివక్ష గాయాలు..
పాఠశాల విద్య కొనసాగుతుండగానే కుటుంబం బాంబేకు తరలివెళ్లడంతో అంబేద్కర్ మిగతా పాఠశాల విద్య అంతటిని బాంబేలో పూర్తిచేశారు. అయితే, పాఠశాల విద్య కొనసాగినన్ని రోజులు తీవ్ర కుల వివక్షను ఎదుర్కొన్నారు. అంటరాని తనంతో విసిగిపోయారు. ఆ తర్వాత వివిధ దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. అయితే, చిన్న వయసులో మనసుకు తగిలిన గాయాలు ఆయనను జీవితాంతం అంటరానితనాన్ని, సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు పోరాడేలా చేశాయి. ఈ పోరాటంలో ఆయన చాలా వరకు విజయం సాధించారు. చిన్న వయస్సులో అవమానాలు భరించినా పెరిగి పెద్దవాడయ్యాక తన ప్రతిభను చాటుకుని సమాజంలో ఒక మహోన్నత మూర్తిగా నిలిచారు.
కులవివక్షను నిరసిస్తూ బౌద్ధమతంలోకి..
అయితే, మరణానికి కొన్ని రోజుల ముందు 1956 అక్టోబర్‌లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించారు. హిందూమతంలో జన్మించిన అంబేద్కర్ కుల వివక్షకు వ్యతిరేకంగా మతం మారాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించడానికి 20 ఏళ్లు పట్టింది. అప్పట్లో అందరినీ సమానంగా చూసిన ఏకైక మతం బౌద్ధమే కావడంతో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే, జీవితాంతం విశ్రాంతి లేకుండా దేశం కోసం, దేశ ప్రజల కోసం సేవచేసిన అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న నిద్రలోనే కన్నుమూశారు.
కాగా, అంబేద్కర్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి ఏడాది ఏప్రిల్ 14న ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. దేశంలోనేగాక, ఇతర దేశాల్లో కూడా అంబేద్కర్ జయంతి వేడుకలు జరుగుతాయి. పుష్పాంజలి ఘటించడం, క్యాండిల్స్ వెలిగించడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆ మహనీయుడికి జనం నివాళులు అర్పిస్తారు. పైన పేర్కొన్నవేగాక ఆయన జీవితానికి సంబంధించి మరెన్నో ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి.
ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్..
1. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అత్యంత ప్రతిభావంతుడు. ఆయన దాదాపు 64 సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీలు సాధించారు. పైగా ఆయన 9 భాషలలో (ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, గుజరాతీ, హిందీ, పాళీ, సంస్కృతం) అనర్గళంగా మాట్లాడగలిగేవారు. సుమారు 21 సంవత్సరాలపాటు ప్రపంచమంతా తిరిగి అంబేద్కర్ విద్యాభ్యాసం చేశారు.
2. డాక్టరేట్ సాధించిన తొలి భారతీయుడిగా కూడా బీఆర్ అంబేద్కర్‌కు గొప్ప గుర్తింపు ఉంది.
3. బీఆర్ అంబేద్కర్ “వెయిటింగ్ ఫర్ వీసా” పేరుతో రాసిన ఆటో బయోగ్రఫీని కొలంబియా యూనివర్సిటీలో పాఠ్యపుస్తకంగా వినియోగిస్తున్నారు.
4. ఇప్పటివరకు లండన్ మ్యూజియంలో కార్ల్మాక్స్ విగ్రహంతోపాటు ఏర్పాటు చేసిన ఏకైక భారతీయుడి విగ్రహం బీఆర్ అంబేద్కర్‌దే కావడం గమనార్హం.
5. బుద్ధ భగవానుడు కళ్లు తెరిచి చూస్తున్నట్టుగా ఉండే పెయింటింగ్‌ను వేసిన తొలి వ్యక్తిగా కూడా అంబేద్కర్‌కు గుర్తింపు ఉన్నది. అంతకుముందు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో బుద్ధుడు కళ్లు మూసుకుని ఉన్న ఫొటోలే కనిపించేవి.
6. వెనుకబడిన కులాల నుంచి న్యాయవాదిగా ఎదిగిన తొలి వ్యక్తిగా కూడా అంబేద్కర్ గుర్తింపు దక్కించుకున్నారు.
7. భీమ్ రావు అంబేద్కర్ అసలు ఇంటిపేరు అంబావడేకర్. అదే ఆ తర్వాత అంబేద్కర్గా మారింది. తాగునీటి కోసం సత్యాగ్రహం చేసిన ఏకైక వ్యక్తి బీఆర్ అంబేద్కర్.
8. 1954లో నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన ‘జగతిక్ బుద్ధిజం కౌన్సిల్’లో బౌద్ధ గురువులు బీఆర్ అంబేద్కర్‌ను ‘బోధిసత్వ’ పేరుతో సత్కరించారు. బతికుండగానే ఆయన ఆ గౌరవాన్ని పొందడం గొప్ప విషయం.
9. అంబేద్కర్ పుట్టినరోజు వేడుకలను బహిరంగంగా నిర్వహించిన తొలి వ్యక్తి జనార్దన్ సదాశివ్ రనపిసే. ఆయన 1928 ఏప్రిల్ 14న ప్రజల నడుమ అంబేద్కర్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.
10. పింగళి వెంకయ్యతో జాతీయ పతాకాన్ని రూపొందింపజేసిన ఘనతోపాటు, జాతీయ చిహ్నంలో ఆశోకచక్రానికి చోటు కల్పించిన ఘనత కూడా బీఆర్ అంబేద్కర్‌కే దక్కుతుంది.
11. తమ యూనివర్సిటీలో డాక్టరేట్ సాధించిన ప్రపంచ ప్రముఖులలో టాప్-100 పేర్లతో 2004లో కొలంబియా యూనివర్సిటీ ఒక జాబితాను రూపొందించింది. ఆ జాబితాలో అంబేద్కర్ పేరు మొదటి స్థానంలో ఉన్నది.