Bomb Threat : తమిళ సినీ పరిశ్రమ (Tamil Film Industry) కి చెందిన ఇద్దరు అగ్ర నటుల ఇళ్లలో బాంబులు పెట్టినట్లు వచ్చిన సందేశం చెన్నై నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. తమిళనాడు డీజీపీ (Tamil Nadu DGP) కార్యాలయానికి ఇవాళ వచ్చిన ఒక బెదిరింపు ఈమెయిల్ పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. పోయెస్ గార్డెన్లోని సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నివాసంలో, అల్వార్పేటలో ఉన్న హీరో ధనుష్ (Dhanush) నివాసంలో బాంబులు అమర్చామని, అవి ఏ క్షణమైనా పేలవచ్చని ఆ బెదిరింపు మెయిల్లో పేర్కొన్నారు. ఈ సమాచారం బయటకు రావడంతో ఒక్కసారిగా అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.
ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో కలిసి రంగంలోకి దిగారు. ఇద్దరు నటుల నివాసాల వద్దకు చేరుకున్న భద్రతాదళాలు సుమారు గంటన్నరపాటు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించాయి. ఇంటి లోపల, గార్డెన్ ప్రాంతం, పరిసరాల్లో అణువణువూ గాలించారు. కానీ ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలుకానీ, అనుమానాస్పద వస్తువు కానీ లభించలేదు. చివరకు అది ఒక ‘ఫేక్ మెయిల్’ అని అధికారులు నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేవలం భయాందోళనలు సృష్టించేందుకే ఎవరో ఆకతాయిలు ఈ పనికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.
గతంలోనూ విజయ్, అజిత్ వంటి ప్రముఖుల ఇళ్లకు ఇలాంటి బెదిరింపులు ఎదురైన సందర్భాలు ఉన్నప్పటికీ.. ఈసారి నేరుగా డీజీపీ కార్యాలయానికే మెయిల్ రావడం చర్చనీయాంశంగా మారింది. ఈమెయిల్ పంపిన వ్యక్తి ఎవరు..? ఏ ఐపీ అడ్రస్ ద్వారా ఈ మెయిల్ పంపారనే కోణంలో సైబర్ క్రైమ్ విభాగం ఆరా తీస్తోంది. తప్పుడు సమాచారంతో ప్రజలను, పోలీసు యంత్రాంగాన్ని ఇబ్బందులకు గురిచేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ముందుజాగ్రత్త చర్యగా రజనీకాంత్, ధనుష్ నివాసాల వద్ద అదనపు భద్రతను ఏర్పాటుచేశారు.