Biological E. Limited | హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఇ మరో ఘనత సాధించింది. న్యూమోనియాను, బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేసిన 14-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ-14) సురక్షితమని నిర్ధారణ అయింది. వ్యాక్సిన్ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ప్రచురించారు. పీసీవీ-14 వ్యాక్సిన్‌కు సంబంధించిన నివేదికను ఆ జర్నల్‌లో ప్రచురించారు. ఈ వ్యాక్సిన్‌ను 6 నుంచి 8 వారాల శిశువులకు ఇచ్చినట్లైతే న్యూమోనియాను అరికట్టేందుకు అవకాశం ఉంటుంది.
భారత్ తోపాటు ఇతర దేశాల్లో ఐదేండ్ల లోపు వయసున్న ఎంతో మంది పిల్లల మరణాలకు కారణమవుతున్న న్యుమోనియాను నిరోధించేందుకు పీసీవీ-14 వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది. 14 రకాల స్ట్రెప్టోకోకస వైరస్ వేరియంట్లను ఎెదుర్కోగలదు. భారత్‌లో అధికంగా వ్యాప్తి చెందుతున్న 22ఎఫ్, 33 ఎఫ్ రకం స్ట్రెప్టోకోకస్ వైరస్ నుంచి సమర్థవంతంగా రక్షణ కల్పిస్తుంది.
ఈ సందర్భంగా బయోలాజికల్-ఇ లిమిటెడ్ ఎండీ మహిమా దాట్ల మాట్లాడుతూ.. పీసీవీ-14 వ్యాక్సిన్ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్ ఫలితాలను వ్యాక్సిన్ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ వ్యాక్సిన్ ప్రయోగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ తయారీ వెనుకాల ఆర్ ఎండ్ డీ యొక్క కృషి ఎంతో ఉందన్నారు. ఇలాంటి అంశాలు ఉద్యోగులకు ప్రేరణ ఇస్తాయని మహిమా దాట్ల అన్నారు.