పాట్నా: కోచింగ్ సెంటర్ టీచర్ ఐదేళ్ల విద్యార్థిని దారుణంగా కొట్టాడు. దీంతో ఆ బాలుడు స్పృహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. ధన్రువా బ్లాక్ ప్రాంతంలోని జయా కోచింగ్ సెంటర్‌కు చెందిన టీచర్ చోటు, సోమవారం ఉదయం ఐదేళ్ల బాలుడ్ని తొలుత కర్రతో కొట్టాడు. దీంతో అది రెండు ముక్కలుగా విరిగిపోయింది. అయితే దెబ్బలు తాళలేక ఆ బాలుడు బోరున ఏడ్చాడు. కొట్టవద్దంటూ టీచర్‌ను ప్రాధేయపడ్డాడు.
అయినప్పటికీ టీచర్ చోటు ఆ విద్యార్థిని కొట్టడం ఆపలేదు. ఆ బాలుడి చెంపలపై కొట్టాడు. అలాగే జట్టు పట్టుకుని పిడిగుద్దులు కురిపించాడు. ఆ క్లాస్‌లో ఉన్నవారంతా ఇది చూసి భయపడిపోయారు. టీచర్ దెబ్బలకు తాళలేని ఆ బాలుడు స్పృహ కోల్పోయాడు. ఆ చిన్నారి పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఆగ్రహం చెందిన కొందరు ఆ టీచర్‌ను పట్టుకుని దాడి చేశారు.
కాగా, ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో బాలుడ్ని నిర్దాక్షిణ్యంగా కొట్టిన టీచర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే బాలుడ్ని టీచర్ కొడుతుండగా కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లో రికార్డు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బాలుడ్ని దారుణంగా కొట్టిన ఆ టీచర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.