పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఒక్కసారిగా కొరడా ఝుళిపించారు. పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లా ను పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతోనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది. . ఇక.. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశించినట్లు సీఎంఓ పేర్కొంది.
మంత్రికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై తమవద్ద సమాచారం వుందని, వాటిపై విచారణ కూడా చేయిస్తామని సీఎం మాన్ తేల్చి చెప్పారు. ఈ మేరకు పంజాబ్ సీఎంవో మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లా పై అవినీతి ఆరోపణలు వున్నాయి. కాంట్రాక్టుల విషయంలో ఒక్క పర్సెంట్ కమిషన్ ఇవ్వాలంటూ డిమాండ్లు చేశారని, పక్కా ఆధారాలు తమ వద్ద వున్నామని సీఎంవో పేర్కొంది.