న్యూఢిల్లీ : 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తమ సంస్థలో 3 వేల మంది తగ్గారని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఉత్పాదకతను పెంచడానికి సాంకేతికతపై పెట్టుబడులు పెట్టడంతో ఈ తొలగింపులు చోటుచేసుకున్నట్టు సమాచారం. కంపెనీ దీర్ఘ కాలిక లక్ష్యమైన డిజిటల్ రూపాంతరం కోసం తీసుకొంటున్న చర్యల్లో భాగంగా ఉద్యోగుల సంఖ్య తగ్గించడం సాధారణంగా జరిగిందేనని బ్యాంక్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరీ తెలిపారు.
అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తమ బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య 1.04 లక్షల నుంచి 1.01 లక్షలకు తగ్గిందని ఆయన తెలిపారు. అయితే ఉద్యోగుల తగ్గింపు లేదా తొలగింపు ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ఆయన వివరణ ఇచ్చారు. వాస్తవానికి తమ బ్యాంక్ శాఖలను పెంచామని తెలిపారు. తమ నిర్వహణ వ్యయంలో నాలుగేండ్ల నుంచి ఏటా 9-10 శాతం సాంకేతికతపై ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఆటోమేషన్‌పై తమ సంస్థ దృష్టి సారించినా.. దాని ప్రభావం ఉద్యోగుల తొలగింపుపై ఇంకా పడలేదన్నారు.