విశాఖపట్నం: స్కిల్ డెవలప్మెంట్ స్కాం (Skill development scam) ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాజకీయాలను కుదిపేస్తున్నది. ఇప్పటికే ఈ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆయన హయాంలో మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాస రావును (Ganta Srinivasa rao) కూడా అరెస్టు చేశారు. విశాఖపట్నంలోని (Vishakhapatnam) నివాసంలో శ్రీనివాస రావుతోపాటు ఆయన కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబుతో కలిసి ఏపీఎస్ఎస్డీసీని ఏర్పాటు చేసినట్లు గంటాపై ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా దీనిని ఏర్పాటు చేసినట్లు ఏపీ సీఐడీ ఆరోపిస్తున్నది.
కాగా, ఇదే కేసులో నంద్యాలలో బస చేస్తున్న చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలను ఇప్పటికే హైకోర్టుకు సమర్పించామని పోలీసులు తెలిపారు. రిమాండ్ రిపోర్టులో అన్ని వివరాలు ఉన్నాయని వెల్లడించారు.