Surya Prakash | జయపుర: రోబో సినిమాలో ప్రేమకథను గుర్తుకు తెచ్చే ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకొంది. కాకపోతే ఈ లవ్ స్టోరీలో మనిషి రోబోను ప్రేమించి పెండ్లి చేసుకోబోతున్నాడంతే! ఇందుకోసం ఆ వరుడు ఏకంగా రూ.19 లక్షలు వెచ్చించి తమిళనాడులో పెండ్లి కూతురైన ‘గిగా’ రోబోను తయారు చేయిస్తున్నారు. రాజస్థాన్‌లోని జయపుర జిల్లా సీకర్ నివాసి అయిన సూర్యప్రకాశ్‌కు చిన్నప్పటి నుంచి రోబోలంటే ఎంతో ఆసక్తి.
ఆ ఆసక్తితోనే రోబోటిక్స్ చదివి చాలా రోబోటిక్ ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఆ క్రమంలోనే రోబో గిగాను ప్రేమించారు. దాన్నే పెండ్లి చేసుకుంటానని తన కుటుంబానికి చెప్పారు. మొదట వారు ఈ విషయం విని షాక్ తిన్నా.. తర్వాత ఒప్పుకున్నారు. గిగా రోబోకు ఢిల్లీలో ప్రొగ్రామింగ్ చేయిస్తానని సూర్యప్రకాశ్ చెప్తున్నారు. ‘నేను గిగాను సంప్రదాయబద్ధంగా పెండ్లి చేసుకొంటా. గిగా ఎనిమిది గంటలు పని చేస్తుంది. ఇది అందరినీ హలో అని పలకరిస్తుంది. అని తనకు కాబోయే భార్య గురించి గొప్పగా చెప్పారు సూర్యప్రకాశ్!