Amit Shah | అంబేద్కర్ అనడం ఫ్యాషనైపోయింది.. ఇన్నిసార్లు దేవుడిని స్మరిస్తే స్వర్గానికైనా వెళ్లొచ్చు: అమిత్‌షా
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరును పదే పదే ఉచ్ఛరించడం ఇప్పుడు ఓ ఫ్యాషన్‌గా మారిందంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. అంబేద్కర్‌ను కాదు ఆయనకు బదులుగా దేవుడిని స్మరిస్తే, స్వర్గానికైనా వెళ్లొచ్చంటూ ఉచిత సలహానిచ్చారు.
- రాజ్యసభలో హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు
- దేశవ్యాప్తంగా దుమారం.. విరుచుకుపడ్డ విపక్షం
- క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్న కాంగ్రెస్
- హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన టీఎంసీ
- బీజేపీ కార్యాలయం ముందు కేజ్రీవాల్ ధర్నా
- దిద్దుబాటు చర్యలకు దిగిన ప్రధాని మోదీ
- అంబేద్కర్‌ను గౌరవిస్తున్నది తామేనని వెల్లడి
- తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న అమిత్ షా
అభీ ఏక్ ఫ్యాషన్ హో గయా హై- అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్. ఇత్నా నామ్ అగర్ భగవాన్ కా లేతేతో సాత్ జనమ్ తక్ స్వర్గ్ మిల్ జాతా (అంబేద్కర్, అంబేద్కర్ అంటూ పదే పదే అనడం ఇప్పుడు ఓ ఫ్యాషన్‌గా మారింది. దీనికి బదులుగా దేవుడిని ఇన్నిసార్లు స్మరిస్తే.. స్వర్గానికి వెళ్లొచ్చు)
– రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా
Amit Shah | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరును పదే పదే ఉచ్ఛరించడం ఇప్పుడు ఓ ఫ్యాషన్‌గా మారిందంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. అంబేద్కర్‌ను కాదు ఆయనకు బదులుగా దేవుడిని స్మరిస్తే, స్వర్గానికైనా వెళ్లొచ్చంటూ ఉచిత సలహానిచ్చారు. అమిత్ షా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అంబేద్కర్‌ను అవమానించిన షాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. అమిత్ షాపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది.
అసలేం జరిగింది? షా ఏమన్నారు??
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరిగింది. ఈ క్రమంలో హోంమంత్రి అమిత్‌షా మాట్లాడుతూ అంబేద్కర్‌ను ఉద్దేశిస్తూ పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘అబీ ఏక్ ఫ్యాషన్ హో గయా హై అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్. ఇత్నా నామ్ అగర్ భగవాన్ కా లేతే తో సాత్ జన్మన్ తక్ స్వర్గ్ మిల్ జాతా (అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అంటూ పదే పదే అనడం ఇప్పుడు ఓ ఫ్యాషన్‌గా మారింది. దీనికి బదులుగా దేవుడిని ఇన్నిసార్లు స్మరిస్తే.. స్వర్గానికి వెళ్లొచ్చు)’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. షా వ్యాఖ్యలను విపక్ష నేతలు సహా నెటిజన్లు కూడా ఖండించారు.
అట్టుడికిన పార్లమెంట్
అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్‌షా వెంటనే క్షమాపణలు చెప్పాలని విపక్షాలు బుధవారం పెద్దయెత్తున నిరసనలు, నినాదాలు చేశాయి. దీంతో రాజ్యసభ అట్టుడికిపోయింది. ఈ క్రమంలో సభ గురువారానికి వాయిదా పడింది. అంబేద్కర్‌ను అవమానిస్తే దేశం సహించబోదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. మనుస్మృతిని అనుసరించే వారికి కచ్చితంగా అంబేద్కర్‌తో చిక్కేనన్న ఆయన షా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇండియా కూటమి సభ్యులతో కలిసి పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ ఫొటోలతో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మూడు రంగుల జెండా, అశోక చక్రానికి బీజేపీ, ఆరెస్సెస్ వ్యతిరేకమన్న విషయాన్ని షా వ్యాఖ్యలు ధ్రువపరుస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. షాను మంత్రి పదవి నుంచి తొలగించాలన్నారు. బీజేపీ మిత్రపక్షాలు షా వ్యాఖ్యలతో ఏకీభవిస్తాయా? అని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నించారు. అంబేద్కర్ పేరును బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకొంటున్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి ధ్వజమెత్తారు. మహాత్మాగాంధీ, నెహ్రూ తర్వాత ఇప్పుడు అంబేద్కర్‌ను బీజేపీ అవమానిస్తున్నదని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ మండిపడ్డారు.
షాపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
అమిత్ షా వ్యాఖ్యలపై టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. అంబేద్కర్ మార్గదర్శకత్వంలో నడిచే లక్షలాది మందికి షా వ్యాఖ్యలు అవమానకరమని బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీ ముసుగు తొలిగిపోయిందన్నారు. అంబేద్కర్ దేవుడికంటే ఎంతమాత్రం తక్కువకాదని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అన్నారు. పార్టీ నేతలతో కలిసి ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
నా వ్యాఖ్యలను వక్రీకరించారు: అమిత్ షా
సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండటంతో తన వ్యాఖ్యలపై అమిత్ షా స్పందించారు. తాను అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తన వ్యాఖ్యలను వక్రీకరించిందని దుయ్యబట్టారు. తాను మాట్లాడిన పూర్తి వీడియోను ప్రదర్శించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఇదే అంశంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. అంబేద్కర్‌ను సంపూర్ణంగా గౌరవిస్తున్నదని తామేనని చెప్పుకొచ్చారు. అంబేద్కర్‌ను అవమానించిన తీరును కాంగ్రెస్ నేతలు ఇలాంటి అబద్ధాలతో ఎప్పటికీ దాచలేరంటూ మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సంక్రాంతికి ముస్తాబు
నేడు వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

