న్యూఢిల్లీ, జూన్ 17: ‘అగ్నిపథ్’పై విపక్షాల నుంచే కాకుండా పాలక బీజేపీ మిత్రపక్షాల నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతున్నది. తక్షణమే ఈ పథకంపై పునఃపరిశీలన జరుపాలని బీహార్ సర్కారులో భాగస్వామ్య పక్షమైన బీజేపీ మిత్రపక్షం జేడీ(యూ), పంజాబ్ లోక్ కాంగ్రెస్ కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. అగ్నిపథ్ వల్ల బీహార్‌తో పాటు దేశవ్యాప్తంగా యువతలో అసంతృప్తి, నిరాశ ఏర్పడ్డాయని, ఉద్యోగపరంగా భవిష్యత్తు అంధకారమైనట్టు వారికి కనిపిస్తున్నదని జేడీ(యూ) అధ్యక్షుడు రాజీవ్ రంజన్ (లాలన్) సింగ్ పేర్కొన్నారు. ఇది దేశ రక్షణ, భద్రతతో ముడివడి ఉన్న అంశం కనుక వెంటనే పునరాలోచన జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలతో ఇప్పటికే అంతర్జాతీయ సమాజం ముందు భారత్ తలవంచుకునే పరిస్థితి దాపురించిందని, ఇప్పుడు ‘అగ్నిపథ్’ వివాదంతో మరోసారి జాతి ప్రజలను తలవంచుకునేలా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, పంజాబ్‌లో బీజేపీతో జట్టుకట్టిన మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ నేత అమరిందర్‌సింగ్ కూడా అగ్నిపథ్‌కు వ్యతిరేకత తెలిపారు. పథకంపై పునరాలోచన జరపాలని కేంద్రాన్ని కోరారు.
అగ్నిపథ్‌ను యువత వ్యతిరేకించారు. సాగు చట్టాలను రైతులు వ్యతిరేకించారు. నోట్ల రద్దును ఆర్థిక వేత్తలు వ్యతిరేకించారు. జీఎస్టీని వ్యాపారులు వ్యతిరేకించారు. ఇంత జరిగినా దేశ ప్రజలు ఏం కోరుకొంటున్నారో ప్రధాని మోదీకి అర్థం కాదు. తన స్నేహితుల మాటలు తప్ప ఆయనకు ఏమీ వినిపించవు.
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
అగ్నిపథ్.. ఆర్మీకే అవమానం. దీంతో యువతకు నష్టం. కేంద్రం అనాలోచిత నిర్ణయం దేశంలో అగ్నిగుండం రాజేసింది. ఇది మంచి స్కీమ్ అయితే బీజేపీ నేతలు తమ పిల్లలను ఆర్మీలో చేర్చి నాలుగేండ్ల తర్వాత తిరిగి రమ్మనాలి.
-భగవంత్ సింగ్ మాన్, పంజాబ్ సీఎం
సంవత్సరం శిక్షణ ఇస్తారు. మరో ఆరు నెలలు ఆర్మీలో చేరేముందు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత రెండున్నరేండ్లు మాత్రమే వారు దేశానికి సేవ చేసే అవకాశం ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో క్రమశిక్షణ, విలువలు వంటి లక్షణాలు ఎలా అలవర్చుకుంటారు?
– జమిర్ ఉద్దీన్ షా, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్)
అగ్నిపథ్ ఒక తప్పుడు నిర్ణయం. ఈ నియమ నిబంధనలతో ఆర్మీలో చేరేందుకు ఎవరూ ముందుకు రారు. ప్రైవేటు సైన్యాన్ని పెంచి పోషిస్తారా?
– సుబేదార్ కెప్టెన్ దర్శన్ సింగ్
నాలుగేండ్లుగా ఆర్మీ కోసం సన్నద్ధమవుతున్నా. మాది పేద రైతు కుటుంబం. అగ్నిపథ్ ద్వారా ఆర్మీలో చేరి నాలుగేండ్ల తర్వాత నన్ను బయటకు పంపిస్తే అప్పుడేం చేయాలి? అప్పుడు పకోడీలు అమ్ముకోవాలా?
-రోహిత్ కుమార్, బెగుసరాయ్, బీహార్
ఆర్మీ తప్ప వేరే ఉద్యోగం చేయాలని కనీసం ఊహించలేను. అగ్నిపథ్ ప్రవేశపెడితే నా జీవితం మొత్తం ఆగమైతది. ఆర్మీలో చేరాక స్థిరమైన భవిష్యత్తు ఉంటుందనే రెండేండ్లుగా ఆర్మీ కోసం సన్నద్ధం అవుతున్నా. అంతేకానీ నాలుంగేండ్ల తర్వాత నిరుద్యోగిని కావాలని కాదు
– శైలేశ్ కుమార్, ముఖ్దుంగంజ్, బీహార్