న్యూఢిల్లీ: ఈ20 ఇంధనం వివాదంతో పాటు చక్కెర ధరల పెరుగుదలపై శాంతియుత నిరసనకు ముందు పౌర హక్కుల సంఘం ‘టీమ్ భారత్’ వ్యవస్థాపకుడు తెహసీన్ పూనావాలాను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అయితే ఆ పోలీసులకు తాను చెరుకు రసం ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ20 ఇంధనం తయారీలో చెరుకు వినియోగం వల్ల దేశంలో చక్కెర ధరలు పెరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శనివారం శాంతియుత నిరసనకు హక్కుల సంఘం ‘టీమ్ భారత్’ పిలుపునిచ్చింది.
కాగా, పౌర హక్కుల నేత తెహసీన్ పూనావాలా ఈ నిరసనలో పాల్గొనేందుకు సిద్ధమవుతుండగా ఢిల్లీ పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చన్న అనుమానంతో తనను హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారని తెహసీన్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు తాను చెరుకు రసం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
మరోవైపు ఈ20 ఇంధనం వివాదంతో పాటు ‘చక్కెర కుంభకోణం’ కారణంగా చక్కెర ధరలు పెరుగుతున్నాయని తెహసీన్ పూనావాలా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రాజకీయ పలుకుబడి ఉన్నవారే లబ్ధి పొందుతుండగా, వినియోగదారులు అధిక మూల్యం చెల్లిస్తున్నారని ఆయన విమర్శించారు.