న్యూఢిల్లీ, మే 25: చేప నూనె సప్లిమెంట్లను తరచూ వినియోగించడం వల్ల మనుషుల్లో గుండె జబ్బులు పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. చేప నూనెలో ఒమేగా-3 కొవ్వు ఉంటుందని, వీటి సప్లిమెంట్లను సాధారణంగా గుండె సమస్యలను తగ్గించడానికి వినియోగిస్తారని, కానీ, ఇవి విరుద్ధంగా పని చేస్తున్నాయని తేలింది.
ఈ అధ్యయనాన్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు. 2006 జనవరి 1 నుంచి 2021 మార్చి 31 వరకు యూకే బయో బ్యాంకు అధ్యయనం నుంచి దాదాపు 12 ఏండ్ల డాటాను పరిశోధకులు విశ్లేషించారు. ఈ పరిశోధనలో యూకేలోని 40-69 ఏండ్ల మధ్య వయసు గల 4.15 లక్షల మంది పాల్గొన్నారు. శ్వేతజాతీయులు మూడింట ఒక వంతు మంది చేప నూనె సప్లిమెంట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటారు. చేప నూనె సప్లిమెంట్స్ క్రమం తప్పకుండా తీసుకొనే వారికి హృదయ స్పందనలో తేడాలు వచ్చినట్టు అధ్యయనంలో వెల్లడయింది.