పుణె, మే 23: పుణెలో ఇద్దరు యువకుల మరణానికి కారణమైన రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం తెరపైకి వచ్చింది. పోర్శే కారును మైనర్(17) నడిపాడని ఇప్పటివరకు పోలీసులు భావించారు. అతడిపైనే కేసు నమోదైంది. ప్రస్తుతం జువైనైల్ సెంటర్‌కు మైనర్‌ను తరలించారు. కాగా, ఈ ప్రమాదం జరిగినప్పుడు కారును నడిపింది తమ డ్రైవర్ అని మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు.
ఘటన సమయంలో కారులో ఉన్న మైనర్ బాలుడి స్నేహితులు ఇద్దరు కూడా కారును డ్రైవరే నడిపాడని తెలిపారు. ప్రమాద సమయంలో తానే కారును నడిపానని డ్రైవర్ కూడా పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. అయితే, కేసు నుంచి మైనర్‌ను తప్పించేందుకే డ్రైవర్‌ను ఇరికిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.