బెంగళూరు: ఐఫోన్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న యువతి అక్కడి టాయిలెట్లో బిడ్డను ప్రసవించింది. ఆ తర్వాత శిశువు గొంతుకోసి చంపింది. మృతదేహాన్ని ఒక కవర్లో పడేసింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. (Teen Gives Birth Inside iPhone Factory) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. దేవనహళ్లిలోని ఐఫోన్ అసెంబ్లీ యూనిట్ ఫాక్స్‌కాన్‌లో 19 ఏళ్ల రేణుక పని చేస్తున్నది. ఏప్రిల్ 22న ఆ యువతి టాయిలెట్‌కు వెళ్లింది. అక్కడ మగ బిడ్డను ప్రసవించింది. ఆ తర్వాత శిశువు గొంతుకోసి చంపింది. మృతదేహాన్ని ఒక కవర్లో పడేసింది.
కాగా, ఆ టాయిలెట్లోకి వెళ్లిన మరో ఉద్యోగిని కవర్లో ఉన్న శిశువు మృతదేహాన్ని గమనించింది. ఆ సంస్థ అధికారులకు ఆమె చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గొంతుకోసి ఉన్న అప్పుడే జన్మించిన శిశువు మృతదేహాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన తర్వాత రేణుక ఈ పని చేసినట్లు గుర్తించారు.
మరోవైపు ఆ యువతి టాయిలెట్‌కు వెళ్లినప్పుడు ఆకస్మికంగా, అనుకోకుండా ఈ ప్రసవం జరిగినట్లు పోలీసులు తెలుసుకున్నారు. పెళ్లికాని రేణుక తన గర్భాన్ని దాచినట్లు అనుమానిస్తున్నారు. సామాజిక అపవాదుకు భయపడి శిశువును హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఆ యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.