న్యూఢిల్లీ, జూన్ 23: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న పదేండ్ల బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడి, అనంతరం దారుణంగా హత్య చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ట్యాక్సీ డ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ బాలిక మృతదేహం ఢిల్లీలోని మెహ్రోలీ అటవీ ప్రాంతంలో లభించినట్లు పోలీసులు చెప్పారు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ సోమవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పీసీఆర్ కాల్ ద్వారా ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు తెలియచేశారు. వారి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన మెహ్రోలీ పోలీసులు బాలిక కోసం గాలింపు చేపట్టారు. ఆ ప్రాంతంలోని వందలాది సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు జల్లెడ పట్టారు. దర్యాప్తు సందర్భంగా పోలీసులకు ఒక అనుమానాస్పద ట్యాక్సీ డ్రైవర్ గురించి సమాచారం అందింది. నాలుగు గంటల్లో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న 25 ఏండ్ల బబ్లూగా అతడిని గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు తానే నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. మెహ్రోలీ ప్రాంతంలోని సీడీఆర్ చౌక్ సమీపంలో ఫుత్పాత్పైన బాలికను అపహరించినట్లు నిందితుడు తెలిపాడు. తర్వాత బాలికను గురుగ్రామ్ తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పాడు.