యాదాద్రి భువనగిరి, మే 23 (నమస్తే తెలంగాణ) : భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ 12 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో ఎకరం భూమిలో ఇంటర్మీడియట్ కళాశాల, ఎకరంలో జడ్పీహెచ్ఎస్ కొనసాగుతున్నది. అయితే ముందు, వెనుక భాగాల్లో ఖాళీ స్థలం నిరుపయోగంగా ఉండటంతోపాటు అపరిశుభ్రంగా ఉండేది. వర్షం వస్తే కళాశాల ఆవరణ వరకు మురుగు నీరు చేరేది. చెత్తాచెదారంతో నిండిపోయేది. వాహనాల పార్కింగ్, పంచాయితీలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నిలిచేది. అంతేకాకుండా భువనగిరి ఓపెన్ స్టేడియం లేదు. ఈ నేపథ్యంలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కొత్తగా ఓపెన్ స్టేడియం నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించారు. ఆర్కిటెక్ట్‌లు పలుమార్లు గ్రౌండ్‌ను పరిశీలించి నివేదిక అందించారు. స్టేడియంతోపాటు పలు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది జనవరి 16న పనులు ప్రారంభించారు. మొత్తం 5 నుంచి 6 కోట్ల నిధులు అవసరం పడుతాయని అంచనా వేశారు. ఇందులో ఓ కార్పొరేట్ కంపెనీ సుమారు రూ.కోటి సాయం చేసింది. మిగతా నిధులను ప్రభుత్వం నుంచి సమకూరుస్తున్నారు.
చకచకా పనులు..
కళాశాల మైదానంలో పనులు చకచకా నడుస్తున్నాయి. పెద్ద ఎత్తున స్టేడియం నిర్మించనుండటంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్ని వసతులతో నిర్మిస్తున్నారు. కళాశాల వెనుక ఉన్న గుట్ట ఇబ్బందిగా మారడంతో దాన్ని సగం వరకు తొలిచేశారు. నిత్యం జేసీబీలను పెట్టి పనులు కొనసాగించారు. ఇక గ్రౌండ్ ఎత్తు, పల్లాలు ఉండటంతో చదును చేయించారు. వైబ్రేటర్స్, రోడ్డు రోలర్, వాటర్ క్యూరింగ్ పనులు చేపట్టారు. మైదానం మొత్తం ఒకే లెవల్లో ఉండేలా వందల ట్రిప్పుల మట్టిని ఇతర ప్రాంతాల నుంచి తెప్పించారు. వర్షం పడినా నీరు నిల్వకుండా చర్యలు చేపడుతున్నారు. మైదానం మొత్తం ఒకే లెవల్‌కు తీసుకొచ్చారు. గ్రౌండ్ గట్టి పడేందుకు రెండు, మూడుసా ర్లు నీటిని పెట్టించారు. ప్రస్తుతం చుట్టూ గ్రీన్ పట్టాలు కట్టి రోడ్డు రోలర్‌తో ఇంకా చదును పనులు చేపడుతున్నారు.
అన్ని మైదానాలు ఒకే చోట..
కళాశాల ఆవరణం క్రీడలకు నిలయంగా మారనున్నది. భువనగిరి పట్టణ, పరిసర ప్రాంతాల క్రీడాకారులతోపాటు వాకర్స్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నది. ప్రస్తుతం స్టేడియం లేకపోవడంతో క్రీడాకారులు, వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారు. క్రీడాకారులు క్రీడలకు దూరమవుతున్నారు. అయితే కళాశాల ముందు, వెనుక భాగాల్లో వివిధ రకాల గ్రౌండ్లను తీర్చిదిద్దనున్నారు. క్రికెట్ గ్రౌండ్ కూడా ఇక్కడే నిర్మించాలని మొదట భావించినా.. ఇటీవల వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వేరే చోటుకు మార్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. వాలీబాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, హాకీ స్టేడియాలను నిర్మించనున్నారు. అథ్లెటిక్ ట్రాక్ చుట్టూ గ్రీనరీతో వాకింగ్ పాత్ నిర్మించనున్నారు. అన్నింటికీ ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేస్తారు. ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు..
కళాశాల ముందు భాగంలోని ప్రధాన రోడ్డు మార్గం పక్కన షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పుడున్న దుకాణాలు తొలగించనున్నారు. కొత్తగా పదుల సంఖ్యలో దుకాణాలు నిర్మిస్తారు. ఆయా షాప్‌లను అద్దెకు ఇవ్వనున్నారు. వీటి ద్వారా ఆదాయం సమకూరుతుందనే ఆలోచన చేస్తున్నారు. ఇలా వచ్చిన డబ్బులతో స్టేడియం నిర్వహణ చేపట్టనున్నారు. ఈ పనులను కూడా త్వరలోనే చేపట్టనున్నారు. ఇక మైదానాలకు ఆటంకం కలుగకుండా ప్రస్తుతం ఉన్న గేట్‌ను లింగం హోటల్ వైపు ఏర్పాటు చేయనున్నారు. ఇక భువనగిరి ఎమ్మెల్యే పట్టణానికి వచ్చారంటే తప్పనిసరిగా కళాశాల గ్రౌండ్‌కు రావల్సిందే. ఉదయం లేదా సాయంత్రం వేళలో తప్పనిసరిగా పనుల పరిశీలిస్తున్నారు.
క్రీడాకారులు, వాకర్లకు ఎంతో ఉపయుక్తం..
జిల్లా నుంచి క్రీడాకారులను ప్రోత్సహించడానికి జిల్లా కేంద్రంలో ఓపెన్ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. భువనగిరి పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఓపెన్ స్టేడియం నిర్మిస్తున్నాం. నిరుపయోగంగా ఉన్న స్థలంలో స్టేడియం ఏర్పాటు చేస్తే క్రీడాకారులు, వాకర్లకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించేందుకు శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పనులు వేగంగా జరుగుతున్నాయి. గుట్ట తొలచడం, చదును పనులు, గుడిసెలు తొలగించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేలా ప్రయత్నిస్తున్నాం.
– పైళ్ల శేఖర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే