సూర్యాపేట, నవంబర్ 21 : రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన వైద్య శాఖలో సమూల మార్పులు తీసుకువచ్చింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లాలో వైద్య శాఖను ప్రక్షాళన చేసి చేరువ చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తు న్నది. అందులో భాగంగా జిల్లాకే తలమానికగా నిలిచిన ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం రూ. 114 కోట్ల వ్యయంతో పూర్తి చేసింది.
త్వరలోనే దీనిని అందుబాటులోకి తేనున్నది. సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలతోపాటు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి, 1 ఏరియా ఆసుపత్రి, 3 సీహెచ్‌సీలు, 22 పీహెచ్‌సీలు, 4 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 161 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటికి తోడుగా త్వరలోనే 64 పల్లె దవఖానాలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలోని 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 16 ఆరోగ్య కేంద్రాల భవనాలను అధునీకరిండానికి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులతో పీహెచ్‌సీల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునీకరణకు దాదాపు రూ. 2.63 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో శానిటైజేషన్, ప్లంబర్ వర్క్, స్లాబ్ సీసీ పనులు, డ్రైనేజీ, ఎలక్ట్రిషన్ వర్క్స్ ఇలా ఆసుపత్రిలో గుర్తించిన పనులను చేపట్టనున్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు పనులను గుర్తించారు. వీటితోపాటు మునగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నూతన భవనంను మంజూరు చేశారు.
కోదాడ నియోజకవర్గంలోని మునగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన భవన నిర్మాణానికి రూ.1.56 కోట్లు మంజూరు చేసింది. మునగాల మండల కేంద్రంలో మొదటగా బ్రిటీష్ కాలం నాటి భవనంలో పీహెచ్సీ నిర్వహించారు. 17వ శతాబ్దానికి చెందిన ఈ భవనాన్ని నాటి బ్రిటీష్ పాలకులు ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించారు. ఆ తరువాత ప్రాధమిక ఆరోగ్య కేంద్రంగా మార్చడం జరిగింది. పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో పక్కనే మరో రెండు గదులను నిర్మించి ప్రస్తుతం ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. రోగులు, వైద్యులు, సిబ్బంది ఒకే గదిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడటంతో నూతన పీహెచ్సీ నిర్మించాలని ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు ప్రభుత్వం నూతన భవన నిర్మాణానికి 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదల చేసింది.