హాలియా, మే 17 : ఆస్తి కోసం రక్త సంబంధీకులను హత్యచేసిన అమానవీయ సంఘటన అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సుమలత(40), లావణ్య(20) తల్లీ కూతుళ్లు. లావణ్య తండ్రి యాదయ్య చిన్నతనంలోనే చనిపోవడంతో నానమ్మ వెంకటమ్మ గార్డియన్‌గా ఉంటూ లావణ్య పేరుమీద ఆరు ఎకరాల వ్యవసాయ భూమిని పట్టా చేసింది. ఇటీవల లావణ్య మేజర్ కావడంతో ఆ భూమి లావణ్య పరమైంది. లావణ్య ఎవరిని వివాహం చేసుకుంటే ఆ భూమి వారికే చెందుతుంది.
అయితే ఆ భూమిపై కన్నేసిన బంధువులు లావణ్యను, తల్లి సుమలతను హతమారిస్తే ఆస్తి తమకే చెందుతున్న దురాశతో ఓ పథకం ప్రకారం ఆదివారం తల్లీకూతుళ్లు పామాయిల్ తోటలో పనిచేస్తుండగా ఇద్దరి కంట్లో కారం చల్లి, చున్నీ మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. విషయం తెలిసిన మిర్యాలగూడెం డీఎస్పీ రాజశేఖర్‌రాజు, హాలియా ఎస్ఐ సాయి ప్రశాంత్ సంఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన విధానం, పరిసరాలను పరిశీలించారు. క్లూస్ టీం, పోలీసు జాగిలాలను రప్పించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేశారు.లావణ్య, సుమలత హత్యకు కారణమైన పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపారు.
తల్లి కోసం వచ్చి హత్యకు గురైన లావణ్య..
లావణ్య హైదరాబాద్‌లో అగ్రికల్చర్ బీఎస్సీ చదివి ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నది. బంధువులు తన తల్లిని ఆస్తి కోసం ఇబ్బందులు పెడుతుండటంతో తోడుగా ఉందామని ఇటీవలే గ్రామానికి వచ్చింది. ఇదే అదునుగా భావించిన లావణ్య మేనత్తలు, ఇతర బంధువులు కలసి లావణ్య, ఆమె తల్లిని పథకం ప్రకారం హత్య చేశారు. లావణ్య ఆరు నెలల వయస్సులో ఉండగా తండ్రి యాదయ్య చనిపోయాడు. తల్లి సుమలత కాయ కష్టం చేస్తూ లావణ్యను అల్లారు ముద్దుగా పెంచి పెద్దచేసి చదివించింది. భర్త మరణాంతరం సుమలతను అత్తమామలు చేరదీయకపోయినా కుమార్తె కోసం రెండోపెళ్లి చేసుకొకుండా కాయకష్టం చేస్తూ అందరి మెప్పు పొందుతూ గౌరవంగా జీవించింది.
ఆస్తి కోసమే హత్య చేశారు..
ఇబ్రహీంపేట పరిధిలోని వ్యవసాయ భూమిలో ఆదివారం ఉదయం సుమారు 9.30 సమయంలో హత్య జరిగింది. రుద్రాక్షి సుమలత, రుద్రాక్షి లావణ్యను చున్నీతో ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆస్తి కోసమే హత్య జరిగినట్లు ప్రాథమిక సమాచారం. త్వరలో హత్యలో పాలు పంచుకున్న వ్యక్తులు, హత్య చేసిన తీరు అన్నీ విషయాలు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూస్తాయి.
-రాజశేఖర్ రాజు, డీఎస్పీ, మిర్యాలగూడెం