కట్టంగూర్, అక్టోబర్ 06 : కట్టంగూర్ మండలంలోని రామచంద్రపురం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను నల్లగొండ ఆర్టీవో యారాల అశోక్‌రెడ్డి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన ఆయన సర్వే పనుల పురోగతి, భూముల వివరాల నమోదు, హద్దుల నిర్ధారణ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రీ సర్వేలో భాగంగా చేపడుతున్న క్షేత్రస్థాయి కొలతలు, రికార్డుల పరిశీలన తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రీ సర్వే పనులకు సంబంధించిన వివరాలను తాసీల్దార్ పుష్పలత, ఆర్ఐ జీవీఎస్ రామారావు, సర్వేయర్ మధు ఆర్టీవోకు వివరించారు. గ్రామంలో రీ సర్వే ప్రక్రియ సక్రమంగా జరిగేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. భూముల హద్దులు, సర్వే రికార్డుల విషయంలో స్పష్టత వచ్చేలా క్షేత్రస్థాయిలో వివరాలను నమోదు చేస్తున్నారు. రీ సర్వే ద్వారా భూములకు సంబంధించిన వివరాలను పక్కాగా నమోదు చేయడంతో భవిష్యత్‌లో భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుందన్నారు.