గరిడేపల్లి, డిసెంబర్ 27 : వరిలో కలుపును నివారించడం ద్వారానే ఆశించిన దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా పంటచేలో మొలిచే కలుపును కూలీలతో తీయించేవారు. కానీ ప్రస్తుతం కూలీల కొరతతో పాటు కూలిరేట్లు విపరీతంగా పెరుగడంతో రైతులు ఇతర పద్ధతులపై ఆధారపడుతున్నారు. కలుపును నివారించేందుకు అనేక రకాల హెర్బిసైడ్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే మార్కెట్లో లభించే రసాయనిక మందులను ఇష్టం వచ్చినట్లుగా వాడితే లాభం కంటే నష్టమే అధికంగా ఉంటుంది. ఏ రకమైన కలుపు మొక్కలకు ఏ మందు, ఎంత మోతాదులో వాడాలనే విషయమై రైతులు అవగాహన కలిగి ఉండడం వల్ల కలుపును పూర్తిగా నివారించవచ్చని గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త దొంగరి నరేశ్ వివరించారు. ఆయన తెలిపిన వివరాలు..
నాటు వేసిన 3 నుంచి 5 రోజుల్లోపు ప్రెటిలాక్లోర్ 50 శాతం ద్రావకం 500 మిల్లీ లీటర్లు లేదా ఆక్సాడయార్జిల్ 80 శాతం డబ్ల్యూపీ 50 గ్రాములు లేదా పైరజో సల్ఫ్యూరాన్ ఈథైల్ 70 శాతం నీటిలో కరిగే గుళికలు 120 గ్రాములు లేదా బెన్ సల్ఫ్యూరాన్ మిథైల్ 0.6 శాతం, ప్రెటిలాక్లోర్ 6 శాతం గుళికలు 4 కిలోలు లేదా ప్రెటిలాక్లోర్ 6.0 శాతం, పైరజో సల్ఫ్యూరాన్ ఈథైల్ 0.15 శాతం గుళికలు ఎకరానికి 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి.
కలుపు మందును సిఫారసు చేసిన మోతాదులో అనువైన సమయానికి సరైన పద్ధతిలో మాత్రమే పిచికారీ చేయాలి. మందు పిచికారీకి సరైన నాజిల్‌ను ఉపయోగించాలి. ఖచ్చితమైన సూచన లేకుండా ఇతర సస్యరక్షణ మందులతో కలిపి వాడకూడదు.
వరిలో కలుపు నివారణకు అనువైన రసాయనిక మందులు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిని వాడి సులువుగా కలుపు నివారించవచ్చు. మొలిచిన కలుపును బట్టి మందును ఎంపిక చేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా సరైన సమయంలో మాత్రమే వినియోగించాలి. సాధారణంగా కలుపు 2- 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మందును సరైన మోతాదులో పిచికారీ చేస్తే నశిస్తుంది. కలుపును నివారిస్తేనే పంట మొక్కలు బాగా ఎదిగి ఆశించిన దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది.
– దొంగరి నరేశ్, కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి