ఇచ్చేదేదో సకాలంలో ఇవ్వండి
సరిగ్గా గతేడాది ఇదే రోజు జూన్26న అప్పటి కేసీఆర్ సర్కార్ ఎకరం లోపు రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులను జమ చేయడం షురూ చేసింది.
- ‘రైతు భరోసా’పై అభిప్రాయ సేకరణలో రైతులు
- ఇప్పటిలాగే ఇవ్వాలని కొందరు.. 10 ఎకరాల వరకే చాలని మరికొందరు..
- సాగు చేస్తున్న భూములకే వర్తింపజేయాలి
- ఎన్నికల హామీ మేరకు కౌలు రైతులకు ఇవ్వాలి
- భేషరతుగా రైతు రుణమాఫీ చేయాలి
- రైతు నేస్తం వీడియా కాన్ఫరెన్స్‌లో రైతుల భిన్న వాదనలు
- జూలై 15లోగా ప్రభుత్వ నిర్ణయం : మంత్రి తుమ్మల
- గతేడాది కేసీఆర్ సర్కారులో ఇదే రోజు రైతుబంధు షురూ..
సరిగ్గా గతేడాది ఇదే రోజు జూన్26న అప్పటి కేసీఆర్ సర్కార్ ఎకరం లోపు రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులను జమ చేయడం షురూ చేసింది. తొలిరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 3.18లక్షల మంది రైతులకు 1.89లక్షల ఎకరాల విస్తీర్ణానికి గానూ 94.97కోట్ల రూపాయలను రైతులకు పెట్టుబడి సాయంగా అందజేసింది. ఇక పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకూ పెట్టుబడిసాయం పక్షం రోజుల్లోనే అందజేసింది. అంటే సీజన్ ఆరంభంలోనే రైతులకు ఇబ్బంది లేకుండా అప్పటి కేసీఆర్ సాగు మద్దతుపై భరోసా నింపారు.
కానీ గతేడాదికి ఒక్కరోజు ముందు అంటే జూన్25వ తేదీ మంగళవారం రైతుబంధు పేరు మార్చి తలపెట్టిన రైతుభరోసా విధివిధానాలపై ప్రభుత్వం చర్చకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సీజన్ ఆరంభమై రైతులు సాగు పనుల్లో నిమగ్నం కాగా ఇప్పుడు అందాల్సిన పెట్టుబడి సాయం ఎలా ఇద్దామంటూ రైతులతో సమాలోచనల పేరుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఇందులో వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి వచ్చే నెల 15వరకు నిర్ణయం ప్రకటిస్తామని చెబుతున్నది. అంటే చర్చలు కొలిక్కి వచ్చి ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసే సరికి వానకాలం సీజన్ ముగింపు వస్తుందేమోనన్న అనుమానాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. అందుకే మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం వీడియా కాన్ఫరెన్స్‌లో మెజార్టీ రైతులు పెట్టుబడి సాయం కింద ఎంతిచ్చినా, ఎవరికిచ్చినా, పరిమితులు విధించినా సీజన్ ఆరంభంలో సకాలంలో రైతుభరోసా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
– నల్లగొండ ప్రతినిధి, జూన్25(నమస్తే తెలంగాణ)
రైతుభరోసాను పటిష్టవంతంగా అమలు చేయడంపై విధివిధానాలు రూపొందించడానికి రైతుల నుంచి సలహాలు, సూచనల పేరుతో మంగళవారం రైతువేదికల్లో వీడి యా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి జి ల్లాలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రైతువేదికలో మొత్తం 12 చోట్ల ఈ కాన్ఫరెన్స్ జరుగగా వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. రైతుల హాజరు నామమాత్రంగానే ఉండగా అధికారులు పూర్తి స్థాయిలో వచ్చారు. ఇందులో ముందుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ రైతు భరోసా కార్యక్రమం మరింత పకడ్బందీగా, సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం రైతుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటుందన్నారు. అందరి సూచనలు పరిగణలోకి తీసుకొని సబ్ కమిటీతో చర్చించి జూలై 15 లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
అయితే నల్లగొండ జిల్లా నుంచి త్రిపురారం మండలం కామారెడ్డిగూడేనికి చెందిన కన్నెగంటి మారయ్యకు మాత్రమే మాట్లాడే అవకాశం లభించింది. ఎంతిచ్చినా, ఎవరికిచ్చినా సకాలంలో రైతులకు డబ్బులు అందేలా చూడాలని చెప్పా రు. రైతుభరోసా, రుణమాఫీ, ఎరువులు, విత్తనాల వంటివన్నీ సకాలంలో అందితేనే రైతులకు ఇబ్బంది ఉండదన్నారు. పది ఎకరాల వరకు పరిమితి విధిస్తూనే కౌలు రైతులను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. మిగతా చోట్ల రైతులు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా అందజేశారు.
మిర్యాలగూడలో పలువురు రైతులు స్పందిస్తూ కేసీఆర్ ఇచ్చిన మాదిరిగానే అందరికీ రైతుభరోసా ఇస్తేనే వ్యవసాయం బాగుంటుందని పేర్కొన్నారు. మరికొందరు 10 ఎకరాల వరకు చాలు అని సూచించారు. ఐటీ పేరుతో రైతుల రైతుభరోసా ఆపొద్దు అని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయేతర, రియల్ఎస్టేట్ భూములకు నిలిపివేయాలని, ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, ప్రభుత్వ ఉద్యోగుల లాంటి వారి భూములకు రైతుభరోసా అవసరం లేదని నకిరేకల్ చందుపట్ల రైతువేదికలో రైతులు సూచించారు. నిజంగా వ్యవసాయం చేస్తున్న అందరికీ సకాలంలో రైతు భరోసా అందించాలని పలువురు అభిప్రాయపడ్డారు. షరతులు లేకుండా రుణమాఫీ వర్తింజేయాలని, వ్యవసాయ అనుబంధ పనులకు ఉపాధి హామీ పనులను అనుసంధానం చేయాలని సూచనలు వచ్చాయి.
రైతులను ఆదుకున్నది కేసీఆరే
రాష్ట్రంలోని రైతులను ఆదుకున్నది కేవలం అప్పటి సీఎం కేసీఆర్ మాత్రమే. రైతుల అకౌంట్లో ఠంఛన్‌గా రైతుబంధు నగదు పడేది. వాటితో మేము ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కొనుక్కునేవాళ్లం. రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకొని, మా బాగు గోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించేది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే వెంటనే రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటివరకు వేసింది లేదు. రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఎన్నికలప్పుడు అందరికీ ఇస్తామని చెప్పి, ఇప్పుడు కొందరికే ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమే. ఇప్పటికైనా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి రైతు భరోసాను అందరు రైతులకు అందించాలి.
– ఊర సోమయ్య, రైతు, అభంగాపురం, (మాడ్గులపల్లి)
పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపులు
మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతును గోస పెట్టిస్తున్నది. రైతు భరోసాపై కోర్రీలు పెడుతున్నది. గత కేసీఆర్ ప్రభుత్వంలో రైతు రాజ్యం నడిచింది. రైతుబంధు ఎన్ని ఎకరాలున్నా పంట వేసే సమయానికి డబ్బులు బ్యాంకు అకౌంట్లో వేసేది. ఇప్పుడు పెట్టుబడి సాయం ఎదురు చూడాల్సి వస్తున్నది. మొన్న యాసంగి పంటకు కూడా రైతు భరోసా పంట వేసే సమయానికి కాకుండా తర్వాత ఇవ్వడంతో అప్పు చేయాల్సి వచ్చింది. రుణమాఫీ విషయంలో కూడా పరిమితులు విధించడం సబబు కాదు. క్వింటాకు 500 రూపాయల బోనస్ ఊసేలేదు. కరెంట్ కష్టాలు మళ్లీ మొదలైనయి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మే పరిస్థితిలేదు. గతంలో మాదిరిగానే రైతుబంధుపై పరిమితులు లేకుండా ఇవ్వాలి లేనిపక్షంలో రైతు ఉద్యమాలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం.
– హతీరాంనాయక్, రైతు, నాన్యాతండా, (మిర్యాలగూడ టౌన్)
ఐటీ కట్టే వారికి రైతు బంధు లేదనడం సరికాదు
ప్రభుత్వం ధాన్యానికి గిట్టు బాటు ధర ఇస్తే కౌలు రైతులకు మేలు జరుగుతుంది. రైతు బంధును ఐటీ కట్టేవారికి ఇవ్వమని ప్రభుత్వం ప్రకటించడం సరికాదు. సన్న ధాన్యానికి బోనస్ ఇచ్చి, దొడ్డు రకానికి ఇవ్వకపోవడం రైతులను మోసం చేయడమే. పండించిన ప్రతి ధాన్యానికి బోనస్ ప్రకటించాలి.
-జాకటి సామేలు, రైతు, (తిప్పర్తి)
ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలి
ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా పథకంపై ఆంక్ష లు విధించాలనుకోవడం సరికాదు. 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అందజేస్తారని జరుగుతున్న ప్రచారంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 10 ఎకరాలు సాగు చేసిన రైతులకు సైతం వ్యవసాయంలో మిగిలింది ఏమీ లేదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన మాదిరిగానే ప్రభుత్వం ప్రతి ఎకరాకు రైతు భరోసా అందజేయాలి.
-నల్లపు వెంకటేశ్వర్లు, అలింగాపురం, (పాలకవీడు)
2014 నుంచి రుణమాఫీ వర్తింపజేయాలి
2014 నుంచి ఈ ఏడాది వరకు పంట రుణాలు తీసుకున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ వర్తించేయాలి. 2018 నుంచి మాత్రమే రుణం తీసుకొని 10 ఎకరాల వరకు సాగు చేసే అన్ని వర్గాల రైతులకు రైతు భరోసా ఇవ్వాలి. సేద్యం కాని భూములకు ఇవ్వకూడదు. భూమి లేని వారిని, కౌలు రైతులను గుర్తించాలి.
-పగడాల మట్టయ్య, రైతు, (పాలకవీడు)
సకాలంలో రైతుభరోసా ఇవ్వాలి
రైతు భరోసా పథకాన్ని ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులందరికీ అందించాలి. కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రూ.2లక్షల రుణమాఫీ సకాలంలో చేయాలి. రైతులను గత ప్రభుత్వం మాదిరిగానే ఏ ఇబ్బంది లేకుండా ఆదుకోవాలి.
– కన్నెగంటి మారయ్య, రైతు, కామారెడ్డిగూడెం, మాజీ సింగిల్‌విండో చైర్మన్, (త్రిపురాం)
10 ఎకరాల వరకు రైతుబంధు ఇవ్వాలి
రైతులకు జూన్ 1వ తేదీలోపు రైతుబంధు ఇవ్వాలి. 10 ఎకరాల వరకు రైతుబంధు ఇవ్వాలి. రైతు భూములకు కూడా రిజిస్ట్రేషన్ వ్యాల్యుయేషన్ పెంచాలి. ఎకరానికి రూ. 30 వేలు మాత్రమే పంట రుణాలు ఇస్తున్నారు. ఎకరానికి రూ.1 లక్షకు పైగా ఇవ్వాలి. వ్యవసాయ అనుబంధాలు కోళ్ల ఫామ్, డెయిరీ ఫామ్, గొర్రెల పెంపకాలకు నిబంధనలు లేకుండా వ్యవసాయ అధికారుల ద్వారా రుణాలు ఇప్పించాలి. పండించిన పంటకు మద్దతు ధర కనీసం వరికి రూ.2,500 ఇస్తేనే కౌలు రైతులకు లాభం జరుగుతుంది. పిండి బస్తాల ధరను తగ్గించాలి. రైతు బయట పెట్టుబడికి అప్పు తెచ్చుకుంటే 3 నుంచి 4 రూపాయలు. అదే బ్యాంకు ఇస్తే రూ.1 మాత్రమే వడ్డీ. రైతుకు ఎకరాకు రూ.1 నుంచి రూ.2 లక్షల వరకు అప్పు ఇవ్వాలి. వడ్లతో తయా రుచేసే ఇతర అనుబంధాలపై రైతులకు అవగాహన కల్పించాలి.
-నర్సింగ్ సోమేశ్వర్, రైతు, చందుపట్ల, (నకిరేకల్ )
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

