నల్లగొండ రూరల్, ఆగస్టు 25 : వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా మంగళవారం నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామంలో రహదారికి ఇరువైపులా 800 మొక్కలు నాటగా, ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన మహోత్సవం కింద జిల్లాలో ఈ సంవత్సరం 57 లక్షల 70 వేల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 60 శాతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశామని, తక్కిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం జిల్లాలో అక్కడక్కడా తుంపర వర్షాలు కురుస్తున్నందున దీన్ని సద్వినియోగం చేసుకుని మొక్కలు నాటాలని, జిల్లాకు కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించాలని చెప్పారు. నాటిన ప్రతి మొక్కకు నిరంతరం నీరందించాలని, ఇందుకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను వినియోగించుకోవాలని, అవసరమైతే విబిజీరామ్ జీ కింద వాచర్ ను ఏర్పాటు చేసుకోవాలని, మొక్కలకు నీరు అందించేందుకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వి.రమేశ్, డి ఎఫ్ ఓ రాజశేఖర్, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రమేశ్, ఫారెస్ట్ రేంజ్ అధికారి రవీందర్, ఉప సర్పంచ్ జే.కే.సతీష్, మాజీ జడ్పిటిసిలు, గుమ్మల మోహన్ రెడ్డి, వంగురు లక్ష్మయ్య, కోదండపూర్ సర్పంచ్ రాణి వెంకన్న, ఎంపీడీవో యాకూబ్ పాల్గొన్నారు.