సూర్యాపేట, మార్చి 12 : ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి విధులు నిర్వహించాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లా అండ్ ఆర్డర్లతోపాటు పలువురికి శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ రాగానే విధుల్లో పాల్గొనే టీంలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. మోడల్ కోడ్‌ను జిల్లాలో పక్కాగా అమలు చేయాలన్నారు.
ఎలాంటి రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి పేరు వచ్చిందని, అదే పేరు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రావాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పోర్టల్‌లో రాజకీయ, ప్రభ్వుత్వానికి సంబంధించిన ఫొటోలు ఉండకుండా తీసివేయాలని చెప్పారు. ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ జిల్లాలో లా అండ్ ఆర్డర్‌ను పోలీసులు సక్రమంగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. పక్షపాతం లేకుండా విధులు నిర్వహించాలని చెప్పారు. గత ఎన్నికల్లో పోలింగ్ ఆలస్యమైన వాటిని గుర్తించి అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, ట్రైనీ ఐపీఎస్ రాజేశ్‌మీనా, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.