కొమురవెల్లి, డిసెంబర్ 13 : తరగతి గదిలో పాఠం చెప్పే సందర్భంలో విద్యార్థులకు అనేక సందేహాలు వస్తాయి. కొందరు తమ సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేసుకుంటారు. మరికొందరు భయం కొద్దీ సందేహాలను బయటపెట్టేందుకు సంకోచిస్తారు. సర్కా రు పాఠ్య పుస్తకాలపై ముద్రించిన క్యూఆర్ కోడ్‌తో అలాంటి వారికి మేలు జరుగుతుంది. క్యూఆర్ కోడ్‌తో పాఠం మరోసారి వినే అవకాశం లభిస్తుంది. డిజిటల్ విధానంలో పాఠాన్ని పునఃశ్చరణతో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఒకప్పుడు పాఠం విన్న తర్వాత సందేహాలు వస్తే నివృత్తి చేసుకునేందుకు చాలా సమయం పట్టేది. ఒకవేళ బడికి వెళ్లకపోతే ఆ రోజు పాఠాలు విద్యార్థి కోల్పోయినట్లే. ఇకపై ప్రభుత పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఆ ఇబ్బంది ఉండదు. ఉదయం తరగతి గదిలో చెప్పిన పాఠ్యాంశం ఇంటికెళ్లిన తర్వాత పాఠ్యపుస్తకాలపై ఉన్న క్యూర్ కోడ్ ద్వారా అదే పాఠ్యాంశం తిరిగి వినే సౌలభ్యం ప్రభుత్వం కల్పించింది.
సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ఇలా..
గూగుల్ లెన్స్ సాయంతో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మనకు కావాల్సినప్పుడల్లా మనకున్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఆ పాఠాన్ని అర్థమయ్యే వరకూ వినొచ్చు, చూడోచ్చు. కావాల్సిన పాఠాన్ని స్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే చాలు దృశ్య రూపంలో కనిపిస్తుంది. దీనిపై చాలా మంది విద్యార్థులకు అవగాహన లేదు. ఉపాధ్యాయులు కూడా దీనిపై మరింత అవగాహన కల్పిస్తే మరింత సత్పలితాలు వస్తాయని పలువురు నిఫుణులు సూచిస్తున్నారు. విద్యా బోధనలో మార్పులకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు విద్యాశాఖ ఈ విధానం అందుబాటులోకి తెచ్చింది.
ఒక్కో పాఠానికి ఒక్కో క్యూర్ కోడ్..
గతంలో పాఠ్యపుస్తకంలో మొదటి, చివరి పేజీల్లో మాత్రమే క్యూఆర్ కోడ్ ఉండేది. ప్రస్తుతం పుస్తకంలోని ప్రతి పాఠ్యాంశంపై క్యూర్ కోడ్ ముద్రించారు. దీంతో విద్యార్థి తనకు కావాల్సిన పాఠ్యాంశాన్ని స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేసి చక్కగా డిజిటల్ పాఠాలను వినడంతో పాటు చూడొచ్చు. మొదట్లో దీక్ష యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటేనే పాఠం వినే అవకాశం ఉండేది. కానీ, ప్రస్తుతం నేరుగా గూగుల్ లెన్స్ ద్వారా క్యూర్ కోడ్ స్కాన్ చేసి పాఠ్యాంశాలు వినవచ్చు. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని పాఠ్య పుస్తకాలపై ప్రభుత్వం క్యూఆర్ కోడ్‌ను ముద్రించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందించింది.
తొందరగా అర్థమవుతాయి..
విద్యార్థులకు క్యూర్ కోడ్ పునఃశ్చరణ సమయంలో బాగా ఉపయోగపడుతుంది. విద్యార్థులు క్యూఆర్ కోడ్‌తో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వీడియో రూపంలో పాఠాలు వినడం ద్వారా పాఠాలు తొందరగా అర్థం కావడంతో పాటు ఎక్కుల కాలం గుర్తుంటాయి.
-ఎం. నాగేందర్, ఉపాధ్యాయుడు,ప్రాథమిక పాఠశాల, గురువన్నపేట
ఆసక్తిగా ఉంది ..
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పాఠం మళ్లీ వినడంతో పాటు వీడియో రూపంలో చూడటం కొత్తగా ఆసక్తిగా ఉంది. తరగతి గదిలో టీచర్ చెప్పిన పాఠం అర్థం కాకపోతే గతంలో చాలా గందరగోళానికి గురయ్యేవాళ్లం. అర్థం కాలేదని టీచర్‌ను మరోసారి అడుగుతామంటే ఏమంటారో అని భయం వేసేది. ఇప్పుడు ఆ సమస్య లేదు క్యూఆర్ కోడ్‌తో అర్థం అయ్యేవరకు వినోచ్చు, చూడోచ్చు.
– పుట్ట స్ఫూర్తి, 10వ తరగతి,గురువన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల