మనసుకు చికిత్స చేద్దాం!
మానసిక సమస్యలను చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ, ఒకవ్యక్తి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసే భయానక పరిస్థితికి ఆ సమస్యలు దారితీస్తాయని ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్టు డాక్టర్ సి.వీరేందర్ చెప్పారు. ‘యూ అండ్ మీ’ సంస్థ ఏర్పాటు చేసి వేలాది మంది మానసిక సమస్యలకు ఆయన పరిష్కారం చూపుతున్నారు. ఆరోగ్య తెలంగాణ ఏర్పాటులో ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు.
- 70శాతం జబ్బుల వెనుక మానసిక సమస్యలే కారణం
- ఓసీడీ, ఒత్తిడి, ఆందోళన, సైకోసిస్‌తో సతమతం
- ఈ లక్షణాలుంటే కచ్చితంగా మానసిక నిపుణులను కలవాల్సిందే
- ఆత్మహత్య ఆలోచనలను నియంత్రించేలా కౌన్సెలింగ్
- ఆరోగ్య తెలంగాణలో మెంటల్ హెల్త్ అవేర్నెస్ కీలకం
- తల్లిదండ్రులూ.. పిల్లల ముందు గొడవలొద్దు
- అసాంఘిక కార్యకలాపాలకు బీజం ఇంట్లోనే
- ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో యూ అండ్ మీ సంస్థ ఫౌండర్, కౌన్సెలింగ్ సైకాలజిస్టు డాక్టర్ సి.వీరేందర్
సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ): మానసిక సమస్యలను చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ, ఒకవ్యక్తి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసే భయానక పరిస్థితికి ఆ సమస్యలు దారితీస్తాయని ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్టు డాక్టర్ సి.వీరేందర్ చెప్పారు. ‘యూ అండ్ మీ’ సంస్థ ఏర్పాటు చేసి వేలాది మంది మానసిక సమస్యలకు ఆయన పరిష్కారం చూపుతున్నారు. ఆరోగ్య తెలంగాణ ఏర్పాటులో ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. ఈ క్రమంలో మానసిక ఆరోగ్యం బాగుంటే అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి తగ్గుతుందని వివరించారు. రాష్ట్రస్థాయిలో మెంటల్ హెల్త్ దవాఖాన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. మెంటల్ హెల్త్‌పై పలు ప్రాంతా లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తూ మానసిక సమస్యలపై అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా అతడిని ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది…
నాలుగు ప్రధాన సమస్యలతో…
నగర వాసులు నాలుగు ప్రధానమైన మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. అవి ఓసీడీ, ఒత్తిడి, ఆందోళన, సైకోసిస్. ఈ కారణాలతో వారు జబ్బులకు గురవుతున్నారు. 70శాతం రోగాల వెనక మానసిక సమస్యలే కారణం. కానీ, ఈ విషయంపై అవగాహన లేక చాలా మంది మానసిక సమస్యలు ముదిరే వరకు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా వారు ఇతర అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ క్రమంలో వారు ఆత్మహత్యల ఆలోచనలు చేస్తున్నారు. ముఖ్యంగా దంపతుల్లో చాలా మంది ఆత్మహత్య వరకు వెళ్తున్నారు.
పిచ్చి అనుకుంటారేమోననే భయం?
చాలామంది మెంటల్ హెల్త్ సమస్యలు అనగానే ‘పిచ్చి’ అని అనుకుంటారేమోనని అపోహ చెందుతున్నారు. అది సరైనది కాదు. మానసిక సమస్యలు అనేక స్టేజీల వారీగా ఉంటాయి. అన్నీ స్టేజీలను మనం నిర్లక్ష్యం చేసినప్పుడు అంతిమంగా పిచ్చి దశకు చేరుకున్నా ఆశ్చర్య పోనక్కర్లేదు. కనుక ప్రతీ మానసిక సమస్య పిచ్చి అని అనుకుని మానసిక నిపుణులను కలవడం లేదు. అలా చేయకుండా మనసు బాగుండడం లేదు అనుకున్నప్పుడు నిపుణులను కలవడం మంచిది.
ఏ లక్షణాలు ఉంటే కౌన్సెలింగ్ అవసరం?
ఎవరికి వారు తమ మానసిక స్థితిని చెక్ చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారో తెలుసుకోవాలి. నిద్ర సక్రమంగా ఉందా? ఉత్సాహంగా ఉంటున్నారా? స్నేహితులు, బంధువులు, సమాజంతో మన కనెక్టివిటీ ఎలా ఉంది? మనం చేసే పనిలో నిమగ్నమవుతున్నామా? ఇలాంటి ప్రశ్నలకు నెగెటివ్ జవాబులు ఉంటే కచ్చితంగా మీరు మానసిక సమస్యతో బాధపడుతున్నట్టే లెక్క. కొన్ని సందర్భాల్లో మీకు ఈ విషయాల గురించి ఆలోచించలేకపోతారు. కానీ, మీ ప్రవర్తనలో వస్తున్న మార్పులను పక్కవారు గుర్తించి నీవు ఇంతకు ముందులా కాకుండా భిన్నంగా ఉంటున్నావంటూ చెబుతుంటారు. మీకోసం, అసహనం ప్రస్తావిస్తుంటారు. అలాంటి సందర్భాలను సీరియస్‌గా తీసుకుని మానసిక నిపుణుల వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పనిచేస్తుందా?
మాత్రలేమీ ఉండవు. మాటలతోనే బాధితుడి ఆలోచనలను మార్చడం (రీస్ట్రక్చర్ ఆఫ్ థాట్స్). సమస్యకు పరిష్కారం చూపెట్టే మార్గాలను తెలియజేయడం. మానసిక సమస్య ఎప్పుడు మొదలైనప్పుడు ఆ ప్రభావం మన ఆలోచనలపై పడుతుంది. మనిషి అంటే ఎవరు? ఆలోచననే. మనం ఎలా ఆలోచిస్తున్నామో అలా అనుభూతి చెందుతాం. ఎలా అనుభూతి చెందుతున్నామో అలా ప్రవర్తిస్తాం. ఇదే ఆ వ్యక్తి జీవనయానం. కనుక ఆలోచన అనేది ఇక్కడ ముఖ్యం. ఆ ఆలోచనలకు కౌన్సెలింగ్ అవసరం పడుతుంది. చాలామంది సూసైడ్ ప్రయత్నం చేస్తుంటారు. ఇదేదో క్షణికావేశం అని చాలామంది అనుకుంటారు. కానీ, వాస్తవానికి అది క్షణికావేశం కాదు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు అతడిని చాలా రోజులుగా వేధిస్తుంటాయి. ఇక బతికి లాభం లేదనే స్థితికి వెళ్లిపోతారు. ఇలాంటి వారి లక్షణాలు మొదట మనం మాట్లాడుకున్నట్టు ఆ నాలుగు ప్రధాన మానసిక సమస్యల నుంచే మొదలవుతాయి.
అందుకే మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.“ఆమె పేరు రవళి. వయస్సు 38. కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. భర్త ప్రైవేట్ ఉద్యోగి. ఆమె ఓసీడీతో బాధపడుతున్నది. కుటుంబ విషయాలన్నీ బయటి వారికి తెలుస్తున్నాయని ఆందోళన చెందేది. ప్రతీది అనుమానమే. అయితే ఈ పరిస్థితి ఎక్కడి వరకు వెళ్లిందంటే వారి ఇంట్లో ఉన్న కదలికలు బయటి వారు చూస్తున్నారని, ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టారని ఊహించుకునే వరకు వెళ్లింది. ప్రతిరోజు ఆమె రాత్రిపూట చీకట్లో స్నానం చేసేది. చీకటిలో ఎందుకు అని భర్త అడిగితే మన ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయంటూ సమాధానం.” ఈ పరిస్థితిలో వారు మానసిక నిపుణులను ఆశ్రయించాడు.
“నేను చెడిపోయాను. నాకు అన్నీ పాడు ఆలోచనలు వస్తున్నాయి. దేవుళ్లపై కూడా నేను పాడు ఆలోచనలు చేస్తున్నాను. నేను బతకడానికి వీల్లేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను.” అంటూ సూసైడ్ లెటర్ రాసి బిల్డింగ్ మీద నుంచి దూకడానికి ప్రయత్నించిన అరుణ అనే వివాహితను ఆమె అన్నయ్య రక్షించి సైకాలజిస్టును సంప్రదించాడు.”
ఆ విద్యార్థి పేరు ప్రకాశ్. బీటెక్ పూర్తి చేశాడు. ఒక అమ్మాయిన ప్రేమించాడు. ఆమె నిరాకరించిందని ఉన్నత చదువులు మానేసి, ఉద్యోగం చేయక ఇంట్లోనే కాలం వెల్లదీస్తున్నాడు. పేరెంట్స్ ఎంత చెప్పినా ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. అతడిని సైకాలజిస్టు వద్దకు తీసుకెళ్లగా కౌన్సెలింగ్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆ అమ్మాయి కోసం నేను తనలా మారిపోయానని. కానీ, ఆ యువతి మోసం చేసిందని చెప్పాడు. దీంతో ఏం చేయలేక చాలాసార్లు సూసైడ్ అటెంప్ట్ చేశానని వివరించాడు.” ఇలాంటి సంఘటనలు ఇటీవలి కాలంలోనే ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా మానసిక నిపుణులను ఆశ్రయించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది.
యూ అండ్ మీ గురించి?
‘యూ అండ్ మీ’ సంస్థ 2006లో ప్రారంభించాం. హైదరాబాద్‌లోన్ బాగ్‌లింగంపల్లిలో ప్రధాన కార్యాలయం ఉంది. ఇప్పటి వరకు 20వేల మందికి పరిష్కారాలు చూపెట్టాం.15వేల మంది విద్యార్థులకు మానసిక సమస్యలపై అవగాహన కల్పించాం. 25వేల మందికి మెంటల్ హెల్త్ మెటీరియల్స్ ఉచితంగా పంపిణీ చేశాం. విదేశాల నుంచి కూడా ఆన్లైన్లో కౌన్సెలింగ్ తీసుకుంటారు. తైవాన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, మలేషియా, వియత్నాం, ఫిలిఫీన్స్, బ్యాంకాక్ తదితర దేశాల్లోనూ కౌన్సెలింగ్ సెషన్స్ ఏర్పాటు చేశాం. అక్కడి వారు ఎక్కువగా ఓసీడీ, డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ఎగ్జిబిషన్లలో అన్ని రకాల చార్ట్‌లు ఏర్పాటు చేసి మానసిక సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమం తీసుకున్నాం. అందులో భాగంగానే ఈనెల 30న దుర్గం చెరువు పార్కులో మెంటల్ హెల్త్ అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం. అందరూ హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాం.
పేరెంట్స్ మేల్కోవాలి..!
చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత పేరెంట్స్‌దే. వారి భవిష్యత్తును అందంగా తీర్చిదద్దగలిగేది వారే. మొదటి ఆరేండ్లు పేరెంట్స్ పిల్లలతో సక్రమంగా లేకపోతే అది చాలా వ్యతిరేక పరిస్థితులకు దారితీస్తాయి. చిన్నారుల మానసిక ఎదుగదలలో పేరెంట్స్‌దే కీలక పాత్ర. తల్లిదండ్రులు పిల్లల ముందరే ఘర్షణలు, పొట్లాడుకోవడం తదితర వినాశకర పరిస్థితులు లేవనెత్తితో ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. ఇద్దరూ పోట్లాడుకుని, అక్రమ సంబంధంతోనో భర్తను వదిలేసి వెళ్లినా..భార్యను వదిలేసి భర్త వెళ్లినా.. ఆ ప్రభావం చిన్నారులపై ఉంటుంది. వారు మానసికంగా కుమిలిపోతారు. ఫలితంగా వారి ఎదుగుదల అంతా వ్యతిరేకంగా (యాంటీ సొసైటీ పర్సనాలిటీ డిజార్డర్) సాగుతుంది. క్రిమినల్స్ అందరూ ఇంట్లోనే తయారు చేయబడుతారనే విషయం అందరు పేరెంట్స్ గుర్తుంచుకోవాలి. మనం చిన్నప్పటి నుంచే పిల్లలను ఎలా పెంచాలో అవగాహనతో ఉండాలి.
ఈ లక్షణాలు ప్రమాదం!
ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ). ఇదొక అనుమాన జబ్బు. చేసిన పనే మళ్లీమళ్లీ చేయాలనుకుంటారు. ఏవైనా పాత్రలు కడిగితే వాటిని మళ్లీమళ్లీ కడుగుతుంటారు. ఒకే ఆలోచనను పట్టుకుని వేలాడుతుంటారు. రెండోది ఒత్తి డి. ఇది చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి వారిని ఏ పని చేయకుండా వెనక్కి లాగుతుంటుంది. మూడోది ఆందోళన. కుదురుగా ఉండనివ్వదు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎలాంటి వార్త వింటామోననే భయం వెంటాడుతుంటుంది. చివరిది సైకోసిస్. ఇది విచిత్రమైనది. ఏమీ లేకున్నా ఏదో కనిపిస్తుందనే భ్రమ పడుతుంటారు. పక్కవారు ఏమీ మా ట్లాడుకున్నా తన గురించే మాట్లాడుతున్నాడు అని నిర్ణయానికి వచ్చేస్తారు. అనుమానంతో రగిలిపోతుంటారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

