జహీరాబాద్, మే 4 : కర్ణాటక శాసన సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ తెలిపా రు. గురువారం న్యాల్కల్ మండలంలో కర్ణాటక సరిహద్దులో ఉన్న పోలీసు చెక్‌పోస్టును తనిఖీ చేసి, బీదర్ పట్టణంలో జరిగిన అంతర్రాష్ట్ర పోలీ సు అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి మద్యం, డబ్బులు తరలించకుండా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. జహీరాబాద్ సబ్‌డివిజన్‌లో చెరాగ్‌పల్లి, గణేశ్‌పూర్, మనియార్‌పల్లి సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 10న కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఇరు రాష్ర్టాల పోలీసులు నేరస్తుల వివరాలు తీసుకోవాలన్నారు. సమావేశంలో బీదర్ కలెక్టర్ గోవిందారెడ్డి, బీదర్ ఎస్పీ చెన్నబసవన్న, జహీరాబాద్ డీఎస్పీ రఘు, బీదర్ జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.
జహీరాబాద్, మే 4 : కర్ణాటక శానసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర సరిహద్దులో 13 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ తెలిపారు. గురువారం రాష్ట్ర సరిహద్దులోని గౌసాబాద్, చెరాగ్‌పల్లి చెక్‌పోస్టులు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 13చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, పోలీసు, ఎక్సైజ్, రెవెన్యూ, వ్యవసాయం, ఫారెస్టు అధికారులతో ఉమ్మడిగా తనిఖీ చేస్తున్నామన్నారు. తెలంగాణ నుంచి కర్ణాటకకు అక్రమంగా మ ద్యం, డబ్బులు తరలించకుండా తనిఖీలు చేస్తున్నామన్నారు. కలబుర్గా, బీదర్ జిల్లాలు సంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉండడంతో 13 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. జాతీయ రహదారిపై రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ టీం ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నామన్నారు. 65వ జాతీయ రహదారిపై చెరాగ్‌పల్లి వద్ద ఎక్సైజ్ చెక్‌పోస్టు 24 గంటలు పనిచేస్తున్నదన్నారు. తనిఖీలో జహీరాబాద్ ఎక్సైజ్ సీఐ అశోక్‌కుమార్, ఎక్సైజ్ సీఐలు లతీఫ్, చిరంజీవి, వెంకట్రామ్రెడ్డి, భిక్షరెడ్డి, సాయన్నతో పాటు అధికారులు ఉన్నారు.
మడ్గి చౌరస్తాలో ఉమ్మడి చెక్‌పోస్టు ఏర్పాటు
65వ జాతీయ రహదారిపై మాడ్గి చౌరస్తాలో ఉమ్మడి చెక్‌పోస్టు ఏర్పాటు చేసి, పలు శాఖల అధికారులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. తెలంగాణ వైపు నుంచి కర్ణాటక వైపు వెళ్లే ప్రతి వాహనాలను తనిఖీ చేసి పంపిస్తున్నారు. జహీరాబాద్ ఏఎస్సై అశోక్‌కుమార్, నర్సింహులు పర్యవేక్షణ చేస్తున్నారు.